తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయ ఘటన..

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో అత్యంత దారుణమైన, అమానవీయ ఘటన వెలుగుచూసింది.

  • వైద్యుల నిర్లక్ష్యంతో నిల్చున్న చోటే ప్రసవించిన తల్లి..

  • కిందపడి శిశువుకు తీవ్ర గాయాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో అత్యంత దారుణమైన, అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం కారణంగా పురిటి నొప్పులతో అల్లాడిపోయిన ఒక గర్భిణీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రసవ వేదనతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన సదరు మహిళను చేర్చుకుని తక్షణ వైద్యం అందించడంలో అక్కడి వైద్యులు, సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

నొప్పులు భరించలేక, వైద్యులెవరూ పట్టించుకోకపోవడంతో ఆ దీనస్థితిలోనే ఆమె నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పుడే పుట్టిన ఆ పసికందు ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది. నేలపై పడటంతో ఆ శిశువు తల, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ఆసుపత్రిలోని ఇతర రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సరిగ్గా బిడ్డ పుట్టిన తర్వాత కూడా కనీసం పది నిమిషాల వరకు ఏ ఒక్క డాక్టర్ గానీ, నర్సు గానీ అక్కడికి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యుల బాధ్యతారాహిత్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే, ఇంత జరిగినా బాధ్యులైన వైద్య సిబ్బంది మాత్రం పోలీసుల ప్రశ్నలకు కనీస పశ్చాత్తాపం లేకుండా అత్యంత నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడం గమనార్హం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సర్కార్ కోట్లు ఖర్చు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే కంటి ముందే గర్భిణీ నరకయాతన పడుతున్నా స్పందించకపోవడంపై స్థానికంగా తీవ్ర ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

#Kothagudem MCH Negligence#Government Hospital Delivery#Newborn Injured Drop#Medical Care Failure#Bhadradri Kothagudem News#Maternity Hospital Horror
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి