పెళ్లిళ్ల పేరుతో బంగ్లాదేశ్ వధువులను అక్రమంగా కొనుగోలు చేసే ముఠాల పట్ల చైనా ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరిని అవలంభిస్తోంది. వివాహ ముసుగులో సాగే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను తీవ్రమైన మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం నిందితులకు మరణశిక్ష పడే ప్రమాదం కూడా ఉందని ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను తీవ్రంగా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికల ద్వారా లేదా నకిలీ బ్రోకర్ల మాటలు నమ్మి మోసపూరిత పెళ్లిళ్ల బారిన పడొద్దని చైనా ఎంబసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహం చేసుకునే ప్రక్రియలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా, లేదా మోసపోయామని గ్రహించినా తక్షణమే స్థానిక పోలీసులకు గానీ, రాయబార కార్యాలయానికి గానీ సమాచారం అందించాలని సూచించింది. విదేశాల్లో స్థానిక చట్టాలను అతిక్రమించడం వల్ల కఠిన జైలుతో పాటు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
చైనా సమాజంలో దశాబ్దాలుగా తీవ్రమవుతున్న లింగ అసమానతలే ఈ తరహా అక్రమ రవాణా వ్యవస్థకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 2020 జనాభా గణాంకాల ప్రకారం చైనాలో పెళ్లి వయసున్న పురుషుల సంఖ్య, మహిళల కంటే కొన్ని మిలియన్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల చైనా పురుషులకు స్థానికంగా వధువులు దొరకడం గగనంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాలు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల పేద మహిళలను టార్గెట్ చేస్తున్నాయి.
ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చైనా రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కేవలం డబ్బు ఆశ చూపి మహిళలను కొనుగోలు చేయడం వంటి నేరపూరిత చర్యల వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చట్టవిరుద్ధ వివాహాలపై బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను మరింత కఠినతరం చేయనున్నారు.












