ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రధాన జలాశయాలకు భారీగా నీరు చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.
ఆల్మట్టి జలాశయానికి ప్రస్తుతం 32 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 123.081 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం 121.957 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు కాగా, ప్రస్తుతం 519.80 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది.
మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 5,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 92.238 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 20,705 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 9.657 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న జూరాలలో ప్రస్తుతం 9.193 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తంగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్మట్టి, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం, నిల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


