సాధారణ రాతిని ఒక పరమ పవిత్రమైన దైవస్వరూపంగా మార్చే పారమార్ధిక ప్రక్రియే విగ్రహ ప్రతిష్టాపన. కొండల్లో, నదీ తీరాల్లో ఒక సాధారణ రాయిగా పడి ఉన్న సమయాన దానిలో ఏ శక్తీ ప్రత్యక్షంగా కనిపించదు. కానీ, ఒక శిల్పి చేతిలో పడి రూపుదిద్దుకున్న క్షణం నుండి దానికి ప్రాణకళ మొదలవుతుంది. ఇది కేవలం రాయిని దేవుడిగా మార్చే ప్రక్రియ కాదు.. మనసులోని అజ్ఞానం, అహంకారం, మాయ అనే పొరలను తొలగిస్తే.. మనలో ఉన్న దైవత్వం వెలుగులోకి వస్తుందనే ఆధ్యాత్మిక సత్యానికి ప్రతీకగా చెబుతారు.
అందుకే.. విగ్రహ ప్రతిష్టాపన అనేది ఒక శిలకు రూపం ఇవ్వడం కాదు... భక్తికి దైవచైతన్యాన్ని అందించే పవిత్ర ప్రక్రియగా శాస్త్రాలు చెబుతాయి. అయితే, కేవలం రూపం సిద్ధించినంత మాత్రాన ఆ రాయి దేవుడు అయిపోడు. ఆ రూపానికి దైవత్వాన్ని ఆవహింపజేసే మహత్తర ఘట్టమే ప్రతిష్టాపన. వేద మంత్రోచ్ఛారణలు, హోమాలు, జలాధివాస, ధాన్యాధివాసాలు, మూలికా సమర్పణల ద్వారా ఆ రాయిలో ఉన్న ప్రతి పరమాణువును శుద్ధి చేస్తారు.
అప్పటి వరకు అది కేవలం శిల మాత్రమే. కానీ అదే శిల దేవాలయంలో ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తుల కళ్లకు సాక్షాత్తూ దైవస్వరూపంగా కనిపిస్తుంది. అసలు ఒక రాయి ఇలా దైవమూర్తిగా ఎలా మారుతుంది అనే విషయం వెనుక మన సనాతన ధర్మం అందించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది. విగ్రహానికి శిల్పరూపం పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే అత్యంత పవిత్రమైన ప్రక్రియే ప్రాణప్రతిష్ఠ. వేదమంత్రాలు, ఆగమ శాస్త్ర విధానాలు, హోమాలు, సంకల్పాలు, ఆవాహనల ద్వారా విశ్వంలో వ్యాపించి ఉన్న దైవచైతన్యాన్ని ఒక నిర్దిష్ట రూపంలో కేంద్రీకరించి ఆరాధనకు అనుకూలంగా చేసే ప్రక్రియగా దీనిని భావిస్తారు.
సూర్యకాంతి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ, ఒక భూతద్దం ద్వారా అదే కాంతిని ఒకే బిందువుపై కేంద్రీకరిస్తే అక్కడ అగ్ని పుడుతుంది. అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంతమైన దైవశక్తిని ఒక పవిత్రమైన రూపంలో, ఒక పవిత్రమైన క్షేత్రంలో కేంద్రీకరించి భక్తులకు అనుభూతి చెందేలా చేయడమే విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన.
ప్రతిష్ఠా సంప్రదాయాన్ని అనుసరించి విగ్రహం కింద యంత్రాలు, నవరత్నాలు, పవిత్ర ద్రవ్యాలు, మూలికలు వంటి వాటిని కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించే విధానాలు ఉన్నాయి. ఇవి ఆ విగ్రహాన్ని కేవలం ఒక శిలగా కాకుండా, దైవసాన్నిధ్యాన్ని అనుభవించే పవిత్ర కేంద్రంగా తీర్చిదిద్దే సంప్రదాయంలో భాగంగా భావిస్తారు.
ఆ తర్వాత జరిగే అక్షిమోచనం మరింత విశిష్టమైన ఘట్టం. విగ్రహానికి నేత్రాలను శాస్త్రోక్తంగా తెరవడం ద్వారా, భక్తుల దృష్టిలో ఆ దైవరూపం తన దివ్యదృష్టితో భక్తులను కటాక్షించడం ప్రారంభించినట్లుగా భావిస్తారు. ఆ క్షణంలో భక్తుడి హృదయంలో ఒక అద్భుతమైన భావన మేల్కొంటుంది.. నేను దేవుడిని చూస్తున్నాను... దేవుడూ నన్ను చూస్తున్నాడు అనే అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత నిత్యపూజలు, అభిషేకాలు, మంత్రోచ్ఛారణలు, హారతులు, భక్తుల ప్రార్థనలు నిరంతరం కొనసాగుతూ ఆ క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తికేంద్రంగా నిలబెడతాయి.
అయితే దేవుడు కేవలం ఒక రాయిలోనే ఉన్నాడని చెప్పడం కాదు... ఆ రాయి రూపంలో అనంతమైన దైవతత్త్వాన్ని దర్శించే స్థితికి మన మనసును తీసుకెళ్లడమే విగ్రహారాధనలోని అంతరార్థం. నిరాకారమైన పరబ్రహ్మాన్ని నేరుగా ధ్యానించడం అందరికీ సులభం కాదు. అందుకే అదే అనంతమైన తత్త్వాన్ని ఒక సాకార రూపంలో దర్శించి, ధ్యానించి, ఆరాధించే మార్గాన్ని మన ఋషులు అందించారు. అందుకే విగ్రహం కేవలం శిల కాదు.. దేవాలయం కేవలం భవనం కాదు..
పూజ కేవలం ఆచారం కాదు. భక్తి, మంత్రం, ధ్యానం, విశ్వాసం, ఆధ్యాత్మిక సాధన మొదలగు అన్నీ ఒకే బిందువులో కలిసే పవిత్ర క్షేత్రమే దేవాలయం. రాయికి రూపం ఇచ్చేది శిల్పి అయితే, ఆ రూపాన్ని పవిత్రమైన ఆరాధనా కేంద్రంగా నిలబెట్టేది ప్రతిష్ఠా సంప్రదాయం.
అయితే ఆ రూపంలో దైవాన్ని అనుభవించేది మాత్రం భక్తుడి నిర్మలమైన హృదయం. ఇదే ఒక సాధారణ శిల నుంచి దైవస్వరూపం వరకు సాగే ఆధ్యాత్మిక ప్రయాణం. నిరాకారం నుంచి సాకారం వరకు... శిల నుంచి శక్తి వరకు... రూపం నుంచి తత్త్వం వరకు... మనిషి నుంచి పరమాత్మ దర్శనం వరకు సాగే మహోన్నత ఆధ్యాత్మిక విజ్ఞానమే విగ్రహ ప్రతిష్ఠాపన అని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


