నార్త్‌లో ఈమధ్యే జెన్ జీ పోరాటం సక్సెస్
గతంలో రైతు పోరాటం.. అన్నా హజారే ఉద్యమం
సీఏఏ, అగ్నివీర్, కుల, మత ఆధారిత ఆందోళనలు
కానీ, సౌత్‌లో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేని పోరాటాలు
గతంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం.. గ్రాండ్ సక్సెస్
సౌత్‌లో మళ్లీ ఆ స్థాయిలో ఎక్కడా లేని పోరాట పంథా
మనోళ్లకు సుఖాలు ఎక్కువయ్యాయంటూ గుత్తా సుఖేందర్ సంచలన వ్యాఖ్యలు
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
నిరుద్యోగ సమస్య ఉందని మొత్తుకుంటున్నరు కానీ ఏ పని చేయడానికి మనోళ్లు సిద్ధంగా లేరంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘‘దావత్‌లు ఎక్కువ అవుతున్నాయి. పనికి వెళ్లినా ఫోన్‌తో ఎక్కువగా గడుపుతున్నారు. చిన్న పని చేయాలన్నా ఇతర రాష్ట్రాల వాళ్లే చేస్తున్నారు’’ అని గుత్తా అన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగిపోతున్నాయని, మనవాళ్లు 40 కిలోల బస్తాలను కూడా మోయలేకపోతున్నారని వాపోయారు. ఇప్పుడు తెలంగాణలో 20 లక్షల మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు పనులు చేస్తున్నారని, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనూ స్కీమ్స్ అమలు చేస్తున్నందున రాబోయే రోజుల్లో అక్కడి నుంచి కూడా ఎవరూ రారన్నారు. అప్పుడు మన పని మనమే చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే మన పిల్లలను పని చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
నార్త్‌లో అలా..
గుత్తా వ్యాఖ్యల తర్వాత సౌత్, నార్త్ ప్రజల జీవన విధానం, పోరాటాలపై తీవ్ర చర్చ జరుగుతున్నది. గత 20 ఏళ్లలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఉద్యమాల తేడాను పలువురు విశ్లేషిస్తున్నారు. నార్త్‌లో గత 20 ఏళ్ల ముఖ్య ఉద్యమాలు చూస్తే అన్నా హజారే ఉద్యమం(2011) ముఖ్యంగా చెప్పుకోవాలి. లోక్‌పాల్, అవినీతి వ్యతిరేకంపై అన్నా హజారే పోరాడి సక్సెస్ అయ్యారు. అలాగే, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా (పంజాబ్, హర్యానా కేంద్రంగా, ఢిల్లీ చుట్టూ 385 రోజులు) రైతులు పోరాటం సాగించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ కూడా నార్త్‌లో ఉద్యమాలు జరిగాయి. అగ్నివీర్, రైల్వే నియామకాల సమస్యలపై యువత గళమెత్తింది. వివిధ కుల/మత ఆధారిత ఆందోళనలు, కార్మికుల నిరసనలు కూడా కొనసాగాయి. ఈ మధ్యే నీట్ విషయంలో జెన్ జీ యువత పోరాటం చేసి సక్సెస్ అయ్యారు. ఏకంగా కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పోరాట స్ఫూర్తి, పని చేసే మనస్తత్వం మన దగ్గర తగ్గిపోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి భావన.
సౌత్‌లో ఇలా..
సౌత్‌లో గత 20 ఏళ్ల ముఖ్య ఉద్యమాలు చూస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం. రాష్ట్రమంతా ఏకమై ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి విజయం సాధించారు. తమిళనాడులో సాంప్రదాయ హక్కుల కోసం జల్లికట్టు ఉద్యమం కొనసాగింది. తమిళనాడులో నీట్ వ్యతిరేక, హిందీ వ్యతిరేక ఆందోళనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కేరళలో కార్మిక/రైతు సమస్యలు, కర్ణాటకలో కుల గణన సంబంధిత డిమాండ్లు వినిపిస్తుంటాయి. సౌత్‌లో ఉద్యమాలు సాధారణంగా భాష, సామాజిక న్యాయం, ప్రాంతీయ హక్కులు చుట్టూ తిరుగుతాయి. నార్త్‌లో అయితే ఎక్కువగా ఆర్థిక, గుర్తింపు (కుల/మత), ప్రభుత్వ విధానాల చుట్టూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వస్తారు. కానీ సామాజిక సంస్కరణలు సౌత్‌లా లోతుగా సాగవు. సౌత్ ఉద్యమాలు చాలావరకు సామాజిక న్యాయం, భాషా గుర్తింపు ఆధారంగా నిర్మితమై, రాజకీయ పార్టీలలోకి విలీనమయ్యాయి. నార్త్‌లో మాస్ ప్రెజర్, ఎన్నికల ప్రభావం ఎక్కువ. గత 20 ఏళ్లలో సౌత్‌లో తెలంగాణే అతిపెద్ద విజయవంతమైన ఉద్యమం. నార్త్‌లో రైతు ఉద్యమం అతిపెద్దది.


