బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సోమవారం కావడంతో శివుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యుత్ షాక్ తగులుతుందనే భయంతో వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మరో 12 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఆలయ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారి సంఖ్యపై అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పవిత్ర మాసమైన శ్రావణ సోమవారం రోజున జరిగిన ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆలయాల్లో తరచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనలకు బాధ్యులు ఎవరు?.. భారీగా భక్తులు తరలివచ్చే రోజుల్లో ఆలయ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది సరైన ప్రాణాళికతో ముందుకు సాగడం లేదా?.. క్యూ నిర్వహణలో లోపాలా? భక్తుల భద్రతను గాలికి వదిలేస్తున్నారా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు కొన్ని ఆలయాల్లో విద్యుత్ వ్యవస్థల భద్రతను నిర్లక్ష్యం చేయడం, ప్రమాదకరమైన విద్యుత్ తీగలు లేదా తాత్కాలిక వైరింగ్ తో ఆలయాలను అలంకరించడం.. వాటిని సకాలంలో తనిఖీ చేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు తగిన మార్గాలు ఏర్పాటు చేయలేకపోవడం, భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసు బందోబస్తు, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. భక్తుల భద్రతకు సంబంధించి ముందస్తు తనిఖీలు, రద్దీ నిర్వహణ, విద్యుత్ భద్రత, అత్యవసర స్పందన వ్యవస్థలను కట్టుదిట్టం చేస్తే ఇలాంటి విషాదాలను చాలావరకు నివారించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












