వందేమాతరంపై బీజేపీ, కాంగ్రెస్ వార్
స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం జరిగింది..?
గీతాలాపనను సోనియా ఆపారా..?
సోనియా క్షమాపణ చెప్పాలంటున్న అమిత్‌షా
దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం వేళ.. వందేమాతరం గీతాలాపన బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరోసారి రాజకీయ అగ్గి రాజేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పూర్తి వందేమాతరం ఆలపిస్తుండగా.. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సంభాషణ, చేతి సంజ్ఞలకు సంబంధించిన వీడియో ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది.
అసలు ఏం జరిగింది?
ఆగస్టు 15న ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వందేమాతరం పూర్తి రూపాన్ని ఆలపించారు. పాట కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీజేపీ నేతల ఆరోపణ మాత్రం మరింత తీవ్రంగా ఉంది. వందేమాతరం మొదటి చరణాలు పూర్తయిన తర్వాత.. పూర్తి గీతాన్ని కొనసాగించడంపై సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారని, దాన్ని ఆపాలని సూచించారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఇదే ఆరోపణ చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా సోనియా గాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వందేమాతరాన్ని అవమానించడం సహించరాని విషయమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అంతేకాదు.. వందేమాతరం రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ వారసుడు, బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కూడా సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ విమర్శల స్థాయి దాటి.. జాతీయ గీతం, జాతీయ గేయాల గౌరవం, స్వాతంత్ర ఉద్యమ చరిత్ర వంటి అంశాలపై చర్చకు దారితీస్తోంది.
కాంగ్రెస్ వివరణ ఏంటి..?
అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ వందేమాతరం గీతాన్ని ఆపాలని చెప్పలేదని.. చాలాసేపు నిల్చున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే ఆమె సూచించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. పూర్తి వందేమాతరం కాంగ్రెస్ కార్యక్రమంలో ఆలపించారని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడ మరో అంశం కూడా రాజకీయ చర్చకు వచ్చింది. వందేమాతరం పూర్తి రూపంపై కాంగ్రెస్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జైరాం రమేశ్ ప్రస్తావించారు. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ తదితరుల సమక్షంలో వందేమాతరం ప్రారంభ చరణాలను కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపించాలని నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం కొత్తదేం కాదు...
వందేమాతరంపై రాజకీయ వివాదం కొత్తది కాదు. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. స్వాతంత్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ కార్యాలయంలోనే పూర్తి వందేమాతరం ఆలపన సందర్భంగా వివాదం చెలరేగడం కొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు, పార్లమెంట్ వందేమాతరానికి సంబంధించిన కొత్త చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ చట్టం ప్రకారం జాతీయ గీతం జనగణమనతో పాటు వందేమాతరానికి కూడా ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది.
సోనియా గాంధీ నిజంగానే వందేమాతరం ఆపాలని సూచించారా? లేక ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే చెప్పారా? వీడియోలో కనిపించిన సంజ్ఞలకు బీజేపీ ఒక అర్థం చెబుతోంది. కాంగ్రెస్ మాత్రం మరో వివరణ ఇస్తోంది. దీంతో వందేమాతరం చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు బీజేపీ-కాంగ్రెస్ మధ్య మరో రాజకీయ పోరుగా మారింది.


