UPI పేమెంట్స్ ఎంత ఫాస్టో.. అంత ప్రాబ్లమెటిక్
మోసపోతే డబ్బు రావడం కష్టమే
మోసపోయిన వెంటనే ఏం చేయాలి..?
ఒక్క క్లిక్.. ఒక్క UPI లావాదేవీ.. అంతే. ఖాతాలోని డబ్బు క్షణాల్లో మరో అకౌంట్‌కు వెళ్లిపోతుంది. కానీ అదే డబ్బు మోసపోయిన తర్వాత తిరిగి రావాలంటే మాత్రం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. అసలు డిజిటల్ పేమెంట్ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి? మోసగాళ్లు ఎలాంటి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు? ముఖ్యంగా.. మోసపోయిన వెంటనే ఏం చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది?
డిజిటల్ చెల్లింపులు మన జీవితాలను సులభతరం చేశాయి. టీ దుకాణం నుంచి షాపింగ్ మాల్ వరకు.. ఇప్పుడు UPIతో చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. అయితే ఇదే సౌకర్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
మోసాల్లో ఎన్నో రకాలు
బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేయడం, KYC అప్డేట్ పేరుతో లింకులు పంపడం, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఇవ్వడం, పెట్టుబడుల పేరుతో భారీ రాబడులు వస్తాయని నమ్మించడం, ఉద్యోగం లేదా రుణం ఇప్పిస్తామని చెప్పడం.. ఇలా మోసాల పద్ధతులు రోజురోజుకూ మారుతున్నాయి.
ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని చెప్పి.. కేసులో ఇరుక్కున్నారని భయపెట్టి డబ్బులు బదిలీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. చాలాసార్లు నేరగాళ్లు మన బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనల్ని నమ్మించి మన చేతులతోనే డబ్బు పంపించేలా చేస్తారు.
మోసపోయిన డబ్బు ఎందుకు వెంటనే తిరిగి రాదు?
డబ్బు ఒక ఖాతా నుంచి బయటకు వెళ్లిన తర్వాత నేరగాళ్లు దాన్ని ఇతర ఖాతాలకు తరలించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తి లేదా ‘మనీ మ్యూల్’ ఖాతాలను ఉపయోగించి డబ్బును అనేక లావాదేవీలుగా మార్చే ప్రయత్నం చేయవచ్చు. దీంతో డబ్బు ఎక్కడికి వెళ్లిందో గుర్తించడం, దాన్ని నిలిపివేయడం మరింత క్లిష్టంగా మారుతుంది.
సైబర్ మోసంలో టైమ్ కీలకం
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2026 జూన్ 30 వరకు సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా 32.80 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో రూ.11,15 కోట్లకు పైగా మొత్తాన్ని కాపాడగలిగారు. అంటే.. మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుంది.
మోసపోయామని గ్రహిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేయాలి. ఆ తర్వాత cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. అదే సమయంలో మీ బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వాలి. లావాదేవీ నంబర్, UTR, స్క్రీన్‌షాట్లు, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, ఇమెయిల్స్ వంటి ఆధారాలను భద్రపరచాలి.
మరో ముఖ్యమైన విషయం.. OTP, UPI PIN, పాస్‌వర్డ్‌లను ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదు. QR కోడ్ స్కాన్ చేసే ముందు అది ఎవరికి డబ్బు పంపుతుందో తప్పనిసరిగా చెక్ చేయాలి.
డిజిటల్ చెల్లింపులు వేగాన్ని ఇచ్చాయి. కానీ ఆ వేగంతో పాటు అప్రమత్తత కూడా అవసరం. ఎందుకంటే.. డబ్బు పంపడానికి కొన్ని సెకన్లు చాలు. కానీ మోసపోయిన డబ్బును తిరిగి తెచ్చుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టొచ్చు. సైబర్ మోసంలో ఒక నియమం మాత్రం గుర్తుంచుకోవాలి. ఆలస్యం చేయకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి.


