రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు నానాటికీ పెరుగుతున్నాయి. సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు సర్కారు, పార్టీమీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేసే వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని, పార్టీలో వారి పెత్తనమే నడుస్తోందని పలువురు సీనియర్లు వాపోతున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
వీరికంటే ముందు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ప్రభుత్వం, పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.తన నియోజకవర్గంలో తనకు కాకుండా బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని, అతని వర్గానికే టికెట్లు ఇస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వచ్చి చేరారు. నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపైనా చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడని, సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పిందని, కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికే టికెట్ ఇచ్చాడని హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి అడిగితే, మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, పనులు ఆపుతున్నాడని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పాడని వారు తెలిపారన్నారు.
మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని, కానీ పార్టీ వదిలి వెళ్లనని, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తానని చిన్నారెడ్డి తెలిపారు.


