రవాణా సేవల విభాగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉబెర్..మరిన్ని నగరాల్లో తమ సేవలు విస్తరించేందుకు నిర్ణయించింది.ప్రస్తుతం మెట్రోసిటీస్, రద్దీగా ఉండే నగరాల్లో ఉబెర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక మీద సెమీ సిటీస్‌లోనూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలను మరింత వ్యాప్తి చేయాలని కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ప్రధానంగా టైర్-2, టైర్-3 మార్కెట్లలో సత్తా చాటేందుకు ఉబెర్ యోచన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు ఉబెర్ తన టూవీలర్ (బైక్) సేవలను విస్తరించింది. మొత్తంగా 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 220కు పైగా నగరాల్లో ఉబెర్ రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇరుకుగా ఉండే రోడ్లు, తీవ్రమైన రద్దీ, తక్కువ ప్రయాణ దూరాలు ఉండే ఈ చిన్న పట్టణాల్లో కాలేజీలు, ఆఫీసులకు ఒంటరిగా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉబెర్ సంస్థ "బైక్-ఫస్ట్" వ్యూహాన్ని అమలు చేస్తున్నది. భవిష్యత్తులో అభివృద్ధికి ఇంజిన్‌గా మారనున్న 'భారత్' వినియోగదారుల వైవిధ్యమైన అవసరాలను తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ వెల్లడించింది.
అయితే, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల్లో అనిశ్చితి కొనసాగుతున్నా.. స్థానిక చట్టాలకు కట్టుబడి ఉబెర్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం 20 లక్షలకు పైగా యాక్టివ్ యూజర్లు(వినియోగదారులు) ఉన్న ఉబెర్.. దేశంలో కేవలం బైక్‌లకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఆటోలు, మెట్రో టికెటింగ్, ఇంటర్-సిటీ బస్సు సేవలను సైతం ఒకే యాప్ ప్లాట్‌ఫామ్‌లోకి ఏకీకృతం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్ల ప్రయాణ అవసరాలన్నింటికీ ‘సింగిల్-క్లిక్’ తో తక్కువ టైంలో పరిష్కారం దొరికేలా చేయడమే తమ అంతిమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


