‘స్వేచ్ఛ’ వరుస కథనాలకు స్పందించిన ప్రభుత్వం
నిషేధిత భూములపై సచివాలయంలో కలెక్టర్లు, ఆర్డీఓలతో
మంత్రి పొంగులేటి అత్యవసర సమీక్ష!సబ్ రిజిస్ట్రార్ల తీరుపై మంత్రి సీరియస్!
రికార్డులు పరిశీలించకుండా తిరస్కరించొద్దు..
ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు..
బాధితుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్
నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలని ఆదేశం
రెవెన్యూ అధికారులకూ మంత్రి పొంగులేటి దిశానిర్దేశం!
నిషేధిత భూముల (Section 22-A) పేరిట సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై ‘స్వేచ్ఛ’ దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రచురించిన కథనాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే సమీక్షకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 22-Aను ఒక భూతంగా చూపిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారినైనా సహించేది లేదని అధికారులను కఠినంగా హెచ్చరించారు. ‘22-A పేరుతో ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్దదిగా మార్చడం ఇకపై కుదరదు. ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారులుగా మీ ప్రాథమిక బాధ్యత’ అని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ల వారీగా వస్తున్న దరఖాస్తులు, వాటి పెండింగ్ కారణాలు, పరిష్కార గడువులపై ఆయన లోతుగా విచారించారు.
కేవలం నిషేధిత జాబితాలో ఉందనే ఏకైక కారణంతో దరఖాస్తులను తిరస్కరించవద్దని, ఆ భూమి ఎందుకు ఆ జాబితాలోకి వచ్చింది? సంబంధిత రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన భూ యజమానులకు న్యాయం చేస్తూనే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఉద్ఘాటించారు. త్వరలోనే బాధితుల ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక 'టోల్ ఫ్రీ నెంబర్'ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ‘స్వేచ్ఛ’ కథనాల ప్రభావంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం కదిలివచ్చిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి నర్ణయంతో బాధితులకు ఊరట
కాగా, దశాబ్దాలుగా 22-A జాబితా పేరుతో తమ సొంత భూములను సైతం రిజిస్ట్రేషన్ చేసుకోలేక, అమ్ముకోలేక తీవ్ర మానసిక, ఆర్థిక వేదనకు గురవుతున్న బాధితులకు మంత్రి పొంగులేటి తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, మండల, జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులకు నిర్దిష్ట కాలపరిమితిని విధిస్తుండటంతో వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతోనైనా తమ భూ సమస్యలకు తుది పరిష్కారం దక్కినట్లేనని భావిస్తున్నారు.


