సోషల్ మీడియాలో ఒక గుర్తుతెలియని ఖాతా వ్యాప్తి చేసిన నకిలీ వార్త ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ఉన్నతాధికారుల వరకు చేరడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌కు చెందిన ఓ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి ప్రారంభమైన తప్పుడు పోస్టును నిజమని నమ్మి, ఇజ్రాయెల్ ప్రధాని తన అధికారిక ప్రసంగంలో ప్రస్తావించడం సోషల్ మీడియా ప్రభావానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
ఆగస్టు 5న భారత్‌కు చెందిన ఒక ఎక్స్ ఖాతాదారుడు.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ ఆపబోమని చెప్పినట్లు ఒక ఫేక్ పోస్టును ఏఐ (AI) చిత్రంతో జత చేసి షేర్ చేశాడు. అయితే వహీది అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. భారత్‌లోనే మరో ఖాతా ద్వారా హిందీలోకి అనువాదమైన ఈ పోస్టు, అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన ‘మొసాద్ కామెంటరీ’ అనే ఖాతాకు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ ఛానల్ 14 ప్రసారాల వరకు చేరి చివరకు నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు కూడా షేర్ చేశారు.
ఈ నకిలీ సమాచారం గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ ప్రధాని జెరూసలెంలోని మౌంట్ హెర్జల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోకి చేరింది. నెతన్యాహు దీనిని ఇరాన్ అణు ఉద్దేశాలకు సాక్ష్యంగా పేర్కొనగా, డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి మైక్ వాల్జ్ కూడా ఈ తప్పుడు పోస్టును షేర్ చేసి, ఆ తర్వాత సైలెంట్‌గా తొలగించారు.
ఈ ప్రచారాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తీవ్రంగా ఖండించారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఒక ఫేక్ పోస్టు ఆధారంగా అంతర్జాతీయ వేదికలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా, భద్రతాపరంగా ప్రమాదకరమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


