తెలంగాణ

కేసీఆర్‌కు సీఎం రేవంత్ బిగ్ ఛాలెంజ్.. సెప్టెంబర్‌లో తెలంగాణ పాలిటిక్స్ హీట్!

రచన: Kashi••10 నిమిషాల పఠనం

అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. బీఆర్‌ఎస్ ప్రస్తుత ప్రభుత్వ హామీలు, అమలు తీరుపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అక్కడే అసలు రాజకీయ సమరం మొదలయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్

తెలంగాణ‌లో మ‌రోసారి పొలిటిక‌ల్ హీట్

సెప్టెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

స‌భా స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ పోరు తెరపైకి వచ్చింది. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సభకు వచ్చి తన పదేళ్ల పాలనపై చ‌ర్చించాల‌ని సవాల్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

కేసీఆర్ 2023లో అధికారం కోల్పోయిన తర్వాత శాసనసభకు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి మరోసారి ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది కేవలం ఒక రాజకీయ సవాల్ మాత్రమేనా? లేక వచ్చే ఎన్నికలకు చాలా ముందుగానే మొదలైన వ్యూహాత్మక పోరా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి?

సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆయన నేరుగా కేసీఆర్‌ను రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పదేళ్లు తెలంగాణను పాలించిన నాయకుడిగా కేసీఆర్ తన పాలనపై సభలో మాట్లాడాలని రేవంత్ సవాల్ చేస్తున్నారు.

ఇది కాంగ్రెస్‌కు రెండు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై చర్చకు వేదిక దొరుకుతుంది. మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును కూడా అదే సమయంలో ప్రజల ముందు ఉంచే అవకాశం లభిస్తుంది. అంటే రేవంత్ వ్యూహం “గత పదేళ్లు వర్సెస్ ప్రస్తుత పాలన” అనే రాజకీయ చర్చను సృష్టించడం కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ సభకు వస్తారా?

ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ శాసనసభ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. తాజాగా రేవంత్ చేసిన సవాల్‌తో ఆయన అసెంబ్లీకి వస్తారా? వస్తే ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు? అనేది ఆసక్తిని రేపుతోంది.

కేసీఆర్ సభకు హాజరైతే బీఆర్‌ఎస్‌కు తన వాదనను నేరుగా వినిపించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కూడా అది పెద్ద వేదిక అవుతుంది. అయితే ఆయన హాజరు కాకపోతే కాంగ్రెస్ దానిని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పదేళ్ల పాలనపై సమాధానం చెప్పడానికి సభకు ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

బీఆర్‌ఎస్‌కు ఇది ఎదురుదాడి చేసే అవకాశమా?

కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హరీశ్ రావు రైతు రుణమాఫీపై సీఎంకి సవాల్ చేస్తూ, అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.

అంటే వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. బీఆర్‌ఎస్ ప్రస్తుత ప్రభుత్వ హామీలు, అమలు తీరుపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అక్కడే అసలు రాజకీయ సమరం మొదలయ్యే అవకాశం ఉంది.

రైతు అంశం కీలకంగా మారుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో రైతు ఓటు అత్యంత కీలకం. అందుకే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతు సంక్షేమం ప్రధాన రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది. రైతుల కోసం తమ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని చెబుతోంది కాంగ్రెస్. ఆగస్టు 15న సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఎం చెప్పారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ పాలనలో రైతుల పరిస్థితిపై చర్చకు రావాలని కేసీఆర్‌ను సవాల్ చేశారు.

బీఆర్‌ఎస్ మాత్రం రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు వేస్తోంది. అందుకే రైతు కోసం ఎవరు ఎక్కువ చేశారు? అనే రాజకీయ లెక్క అసెంబ్లీ వేదికగా మొదలయ్యే అవకాశం ఉంది.

కేటీఆర్, హరీశ్ రావు పాత్ర ఎలా ఉంటుంది?

కేసీఆర్ సభకు వస్తారా లేదా అన్నది ఒక అంశమైతే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చేసే రాజకీయ పోరాటం మరో కీలక అంశం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి, పాలనాపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్‌లోని కొందరు నేతల వ్యాఖ్యలను కూడా బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు హరీశ్ రావు రైతు సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి మూడు వేర్వేరు రాజకీయ గొంతులు వినిపించే అవకాశం ఉంది—కేసీఆర్ రాజకీయ అనుభవం, కేటీఆర్ దూకుడు, హరీశ్ రావు రైతు అంశాలపై దృష్టి. ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ ఆయుధాలుగా మారాయి.

అసలు టార్గెట్ 2028..?

ఇక్కడే ఈ పరిణామానికి మరో కీలక కోణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు లేవు. షెడ్యూల్ ప్ర‌కార‌మైతే 2028 చివ‌ర్లో జ‌ర‌గాల్సి ఉంది. కానీ తెలంగాణలో ప్రధాన పార్టీలు ఇప్పటికే భవిష్యత్ ఎన్నికల కోసం తమ రాజకీయ వ్యూహాల‌ను బలోపేతం చేసుకుంటున్నాయి.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో కాకుండా డీలిమిటేషన్ జరిగితే 2029 మే–జూన్‌కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. అయితే దీనిపై ఇప్ప‌టికీ ఒక క్లారిటీ రాలేదు.

అందువల్ల సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక సాధారణ శాసనసభ సమావేశంగా చూడటం కంటే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భవిష్యత్ రాజకీయ యుద్ధానికి ఒక ట్రయల్ రన్‌గా చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం ఉంది.

కేసీఆర్ సభలో అడుగుపెడితే రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. రాకపోతే కాంగ్రెస్‌కు మరో ప్రచార అస్త్రం దొరుకుతుంది. కేటీఆర్, హరీశ్ రావు సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగితే బీఆర్‌ఎస్‌కు అది ప్ల‌స్ అవుతుంది.

బీజేపీ కూడా రెడీ

తెలంగాణ‌లో మూడో ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ కూడా ఈ స‌మావేశాల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంది. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫల్యాల‌పై పోరాటం చేయాల‌ని తెలంగాణ బీజేపీ నేత‌లకు ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీ వేడిగా జ‌రిగే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

#Telangana Politics#Revanth Reddy#KCR#BRS#Congress#Telangana Assembly#Telangana News#KTR#Harish Rao#Telangana Assembly Session#Telangana Political News#Telangana Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి