అభిప్రాయం

LifeStyle: గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు?

రచన: Venu•••5 నిమిషాల పఠనం

ఒకే ఇంట్లో ఉన్నా.. తల్లిదండ్రులు, పిల్లలు తమ తమ ప్రపంచాల్లో మునిగిపోతున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను వినే సమయం తగ్గితే.. వారు సమాధానాల కోసం బయట ప్రపంచాన్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఒకప్పుడు యువత అంటే దేశ భవిష్యత్తుకు ప్రతీక. మార్పుకు నాంది పలికే శక్తి. కానీ నేడు ఆ యువత గాడితప్పుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని వెంటాడుతున్న అలవాట్లు, ఒత్తిళ్లు, ఆలోచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి కెరీర్ ఒత్తిడి వరకు.. కుటుంబ సంబంధాల నుంచి జీవనశైలి మార్పుల వరకు అనేక అంశాలు యువత ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వినియోగం యువత జీవితంలో అంతర్భాగంగా మారింది. సమాచారం, అవకాశాలు అందుబాటులోకి వచ్చినా.. అతిగా స్క్రీన్‌ టైమ్, ఇతరులతో తమ జీవితాన్ని పోల్చుకోవడం, నిరంతరం గుర్తింపు కోసం ఎదురుచూడటం వంటి పరిణామాలు అసంతృప్తి, ఆందోళనకు దారితీస్తున్నాయి. సమస్య సోషల్ మీడియాలోనే కాదు.. దాన్ని ఉపయోగించే యువతలో కూడా ఉందని అంటున్నారు.

మరోవైపు బిజీ బిజీ జీవితాల్లో సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్న కుటుంబాల్లో మాటలు తగ్గిపోవడం కూడా ప్రభావం చూపుతోంది. ఒకే ఇంట్లో ఉన్నా.. తల్లిదండ్రులు, పిల్లలు తమ తమ ప్రపంచాల్లో మునిగిపోతున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను వినే సమయం తగ్గితే.. వారు సమాధానాల కోసం బయట ప్రపంచాన్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది.

LifeStyle: గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు?

ఇక చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వంపై పెరుగుతున్న పోటీ పెద్ద సవాలుగా మారింది.. మంచి మార్కులు, మంచి ఉద్యోగం, భారీ జీతం.. ఇవే విజయానికి కొలమానాలుగా మారడంతో చిన్న అపజయం కూడా కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. నిరుద్యోగం, కెరీర్‌పై అనిశ్చితి కూడా ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. అలాగే స్నేహితుల ప్రభావం, చెడు అలవాట్లు, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా యువత జీవనశైలిని మార్చుతున్నాయి.

అయితే ఈ పరిస్థితికి పూర్తిగా యువతనే బాధ్యులుగా చూడటం సరైంది కాదు. ఎందుకంటే ఇదే తరం స్టార్టప్‌లు నిర్మిస్తోంది.. పరిశోధనల్లో రాణిస్తోంది.. క్రీడల్లో ప్రపంచ స్థాయిలో దేశానికి పేరు తెస్తోంది. నేటి యువతలో శక్తివంతమైన ఆలోచనలకు కొడువలేదని కొందరు నిరూపిస్తుండగా.. మరికొందరికి సరైన దిశ దొరకక జీవితాలను ఆగాధంలోకి నెట్టేసుకుంటున్నారు.

దీనికంతటికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో కుటుంబంతో సమయం కేటాయించక పోవడం. విద్యాసంస్థలు విద్యార్థులను ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా.. వారి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. అలాగే యువత కూడా డిజిటల్ ప్రపంచానికి పరిమితులు పెట్టుకుని పుస్తకాలు, క్రీడలు, వ్యాయామం, సృజనాత్మకతకు సమయం కేటాయించాలి. అప్పుడే సమస్యకు యువత కారణం కాకుండా.. సరైన మార్గనిర్దేశం లభిస్తే యువతే సమస్యకు పరిష్కారం అవుతుంది.. నేటి యువతపై తీర్పు చెప్పడం కాదు.. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి చేతుల్లోనే రేపటి భారతదేశం ఉంది..

#LifeStyle#youth#Social media#career#bad habits#insomnia#exercise#responsible#Youth Struggles
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి