పండుగలు, జాతీయ సెలవు దినోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్స్ యాజమానులు ఆఫర్స్ ప్రకటించడం కామన్.నిన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ బట్టల దుకాణ యాజమాని వింతైన ఆఫర్ ప్రకటించాడు. ఏ రకమైన డ్రెస్ మెటీరియల్ కొనుగోలు చేసినా రూ.16 మాత్రమే అని.. ఆ ఆఫర్ కూడా కేవలం రూ.16 నిమిషాలు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు.
ఆ షాపునకు వెళ్లే దారంతా జనాలు నిండిపోయారు. వారంతా పరుగులు తీయడంతో సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకివెళితే.. యూపీలోని కాన్పూర్‌లో రయీస్ ఆలం అనే వ్యక్తి స్థానికంగా బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. తన దుకాణంలో సేల్స్ పెంచుకోవడానికి విచిత్ర ఆలోచన చేశాడు. సాధారణంగా ఎవరైనా ఎంఆర్‌పీ ధర మీద 50 శాతం లేదా 70 శాతం డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. కానీ, రయీస్ ఆలం మాత్రం రూ.16 కే డ్రెస్ మెటీరియల్ ఇస్తానని ప్రకటించాడు. అది కాస్త ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. కేవలం 16 నిమిషాలు మాత్రమే ఆఫర్ ఉంటుందని తెలియడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల వారు సైతం ఎగబడినట్టు తెలిసింది.
దీంతో స్థానిక వ్యాపారులు, పాదచారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్టు సమాచారం.భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం జనాలు పరుగులు తీయడానికి గల కారణంపై ఆరా తీయగా..రయీస్ ఆలం ఆఫర్ గురించి వారికి తెలిసింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొనడానికి, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమైన రయీస్ ఆలంపై పోలీసులు చర్యలు చేపట్టారు.శాంతి భద్రతలకు విఘాతం కల్పించాడని అతని మీద పోలీసులు కేసు పెట్టినట్టు తెలుస్తోంది.
https://x.com/pulsenewsbreak/status/2088881132976976094?s=20


