తెలంగాణ

Palamuru: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. రేపటి నుండి మండల స్థాయిలో ప్రజావాణి!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల స్థాయికి కూడా విస్తరించనున్నారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల స్థాయికి కూడా విస్తరించనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై నేరుగా అధికారులకు ఆర్జీలు సమర్పించవచ్చు. కాగా మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగే ప్రజావాణికి ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు కూడా కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

మరోవైపు ప్రజలు సమర్పించిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. తమ మండల పరిధిలోనే సంబంధిత అధికారులను కలిసి సమస్యలను వివరించి పరిష్కారం పొందే అవకాశం కలుగుతుంది.

ఇక ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం, సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో.. మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు సూచించారు. అదే సమయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణికి సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

కాబట్టి.. మీ సమస్య ఏదైనా సరే.. ఇక కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మండలంలోనే ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని మీ సమస్యకు పరిష్కారం పొందండని అధికారులు పేర్కొంటున్నారు..

#Palamuru#Collectors#resolving issues#Prajavani#mandal level#starts tomorrow
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి