Venky Atluri: మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం ప్రతీ ఒక్క దర్శకుడు ఎదురుచూస్తుంటాడు. ఒక్క సినిమా అనుభవంతో మెప్పిస్తే చాలు..స్వయంగా చిరు పిలిచి కథ ఉంటే చెప్పమన్న యువ దర్శకులెందరో ఉన్నారు. ఇటీవల ఇండస్ట్రీకొచ్చి గుర్తింపు తెచ్చుకున్న, శ్రీకాంత్ ఓదెలనే దీనికి పెద్ద ఉదాహరణ. దసరా లాంటి కల్ట్ క్లాసిక్ హిట్ తర్వాత నాని నిర్మాతగా చిరు హీరోగా ఓ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
అయితే, చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు, అంతకముందు కమిటైన విశ్వంభర, బాబి చిత్రాలు లైన్‌గా ఉండటంతో..ఈలోపు నానితోనే మరో సినిమాను పట్టాలెక్కించాడు శ్రీకాంత్ ఓదెల. ఆ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఈలోపు చిరు కూడా బాబీ సినిమాను దాదాపు పూర్తి చేసేస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా సెట్స్‌పైకి వచ్చేస్తుంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే, వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా వరకూ శ్రీకాంత్-చిరు సినిమా రిలీజ్ కావచ్చు.
అయితే, సున్నితమైన కథ-కథనాలతో హృద్యమైన భావోద్వేగాలతో సినిమాలు తీసి హిట్ కొడుతున్న మరో యువ దర్శకుడు వెంకీ అట్లూరికి ఇంతకముందే మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. కానీ, ఆయన వెనకడుగు వేసినట్టుగా వెల్లడించారు. గతంలో, వెంకీ అట్లూరికి చిరు ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత, దీని ఊసే లేకుండా పోయింది. అయితే, తాజాగా సూర్యతో వెంకీ తీసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
చిరును డైరెక్ట్ చేయాలంటే ఇంకా అనుభవం కావాలనిపించింది. ఇంతపెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయగలననే నమ్మకం లేకుండా ఆయనతో సినిమా చేయలేననిపించింది. ఏదైనా పొరపాటు జరిగితే నిర్మాత డబ్బు కూడా లాసవుతుందని చిరుతో సినిమా చేయడానికి వెనకాడానని..మూడు నాలుగు సినిమాల అనుభవం సరిపోదనిపించిందంటూ చిరుతో మూవీ మిస్ అయిన విషయాన్ని రివీల్ చేశాడు. ఇప్పుడు, సూర్యతో భారీ హిట్ కొట్టాడు కాబట్టి..ఇక మెగాస్టార్ మీదే దృష్టి పెడతాడేమో చూడాలి.


