తెలంగాణ

Telangana: రాజసమా? రాజకీయమా? హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం!..

రచన: Venu•••7 నిమిషాల పఠనం

ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రాజగోపాలరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.. పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.. పీసీసీ అధ్యక్షుడి సూచనలను లెక్కచేయని ధోరణిలో ఆయన స్పందించడం.. ఇది కేవలం అభిప్రాయ భేదమా? లేక రాష్ట్ర నాయకత్వానికే సవాలా? అనే ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి..

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పార్టీ నాయకత్వంపై విమర్శలు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలపై అభ్యంతరాలు.. ఇవన్నీ చూస్తే అసలు రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు? అనే సందేహాలు కలుగుతున్నాయి..

మరోవైపు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో రాజగోపాలరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.. పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.. పీసీసీ అధ్యక్షుడి సూచనలను లెక్కచేయని ధోరణిలో ఆయన స్పందించడం.. ఇది కేవలం అభిప్రాయ భేదమా? లేక రాష్ట్ర నాయకత్వానికే సవాలా? అనే ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి..

ముఖ్యంగా ఆయన టార్గెట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్ వంటి నేతలను కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించడం.. ఆ చేరికలకు బాధ్యత వహించిన రేవంత్‌రెడ్డి నిర్ణయాన్నే రాజగోపాలరెడ్డి ప్రశ్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన.. అక్కడి రాజకీయ పరిణామాల తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు.

ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోనే అసంతృప్తి స్వరం వినిపిస్తూ ఉండటంతో అసలు ఆయన రాజకీయ అజెండా ఏమిటన్న చర్చ మొదలైంది. ఒకవేళ మళ్ళీ బీజేపీ తలుపులు తీస్తే ఆ పార్టీ నాయకత్వం ఆయనను ఎంతవరకు విశ్వసిస్తుందన్నది కీలకం. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, ప్రత్యర్థులు ఉండరు కాబట్టి.. భవిష్యత్ సమీకరణాలను పూర్తిగా కొట్టిపారేయలేం.. అలాగే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీ నాయకత్వం రాజగోపాలరెడ్డిని అంగీకరిస్తుందా? అన్నది ప్రశ్నగా ఉంది.

ముఖ్యంగా గత రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆ మార్గం కూడా అంత సులభంగా కనిపించడం లేదు. మరోవైపు రాజగోపాలరెడ్డి మాట్లాడుతున్న ప్రత్యామ్నాయ రాజకీయాలు, మార్పు, కొత్త రాజకీయ దిశ వంటి అంశాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. నిజంగానే కొత్త రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారా? లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ అంతర్గత పోరాటాన్ని కొనసాగిస్తారా? అన్నది స్పష్టత లేని అంశంగా రాజకీయ విశ్లేషశకులు భావిస్తున్నారు..

అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. ఒక సీనియర్ ఎమ్మెల్యే బహిరంగంగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. ఎందుకు నియంత్రించడం లేదు? పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎందుకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నలు కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు పార్టీ ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో అంతర్గత విభేదాలు కూడా ఒకటి.

ఇప్పుడు అధికారం చేతిలో ఉన్న సమయంలో మళ్లీ అదే విభేదాలు బహిరంగ రూపం దాల్చితే.. దాని ప్రభావం ప్రభుత్వం, పార్టీ రెండింటిపైనా పడే అవకాశం ఉందన్నది సత్యం.. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ముగింపు ఎప్పుడనే ఆసక్తి నెలకొంది. మరోవైపు కొందరు నేతలు రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

దీంతో ఇది ఒక్క రాజగోపాలరెడ్డి అసంతృప్తేనా? లేక కాంగ్రెస్‌లోని మరో వర్గం అసంతృప్తికి ఆయన కేంద్ర బిందువుగా మారుతున్నారా? అన్నది రహస్యమైన అంశంగా పేర్కొంటున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో విభేదాలు కొత్తేమీ కాదు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ విభేదాలు బహిరంగ పోరాటంగా మారితేనే సమస్య. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరిచే అంశంగా పేర్కొంటున్నారు.

ఇక రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి నాయకత్వంపై ఒత్తిడి పెంచుతారా? పార్టీని వీడి మరో పార్టీలో చేరుతారా? లేక కొత్త రాజకీయాలకు తెర తీస్తారా? అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది. అయితే ఈ మూడు మార్గాల్లో ఆయన ఏది ఎంచుకున్నా.. దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలపై పడటం ఖాయం అని అంటున్నారు..

ఇక రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. కానీ ఆయన చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత అసంతృప్తి ఇంకా చల్లారలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. మొత్తానికి రానున్న రోజుల్లో ఈ చిచ్చు కాంగ్రెస్ కు నష్టంగా మారుతుందా? లేక రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితానికి కీలక మలుపుగా మారుతుందా అనేది చూడాలి..

#Telangana#congress#MLA#Komatireddy Rajagopal Reddy#causing massive damage#political
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి