వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే కొత్త సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, సరఫరా వ్యవస్థ ఆధునికీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులు, గృహ, వాణిజ్య వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.. మరోవైపు దావాజిపల్లిలో కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.
ముఖ్యంగా లో-వోల్టేజీ సమస్యలు, తరచూ విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థపై ఒత్తిడి కూడా తగ్గనుంది. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ నాణ్యంగా అందడంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. అదే సమయంలో ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మెరుగైన రహదారులతో రైతులు పంటలను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు వీలు కలుగుతుందని, గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని వివరించారు.
అదేవిధంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు.. స్వయం ఉపాధి అవకాశాలను కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక మౌలిక వసతులు మెరుగుపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక ప్రజా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రులు వివరించారు.


