* హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
* కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన సమావేశం
* శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చ
* రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై జలసౌధలో చర్చ
KRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి పంపిణీపై చర్చించారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశ పరిచారు.
తొలుత ఈ నెల 13న సమావేశం అయ్యేందుకు తేదీని ఖరారు చేశారు. తర్వాత 17కు వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. నేటి భేటీలో శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. తాగునీటి కోసం చెరి సగం వాడుకోవాలని తెలంగాణ ప్రస్తావించింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సెప్టెంబర్ 4కు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
50:50 నిష్పత్తిలో వాడుకోవాలి
సాగర్, శ్రీశైలం నీటి వాటాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. ఎల్‌నినో దృష్ట్యా తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. తాగు నీటికి 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పామని, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.
"నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వాటాలపై చర్చ జరిగింది. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా తాగునీటి కోసం మాత్రమే నీటిని వాడుకోవాలని త్రిసభ్య కమిటీలో నిర్ణయించారు. తాగునీటి కోసం 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పాం. ఏపీ పోతిరెడ్డిపాటు నుంచి ఎక్కువ నీరు వాడుకుందని ఫిర్యాదు చేశాం. సెప్టెంబర్ 4న తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ ఉంటుంది. భవిష్యత్లో ప్రవాహాలు వస్తే తదుపరి ఆలోచిస్తాం'' అని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు చెప్పారు.
సెప్టెంబర్ 4న చర్చ
ఎల్ నినో పరిస్థితుల్లో తాగునీటి కోసమే ఉపయోగించుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి తెలిపారు. రెండు రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదని, సెప్టెంబర్ 4న మళ్లీ సమావేశమై చర్చిస్తామని వెల్లడించారు.


