తెలంగాణ

Nirmal: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!..

రచన: Venu•••3 నిమిషాల పఠనం

ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూనే మరోవైపు లంచాలు తీసుకోనిదే బ్రతకలేని స్థితికి ప్రభుత్వ అధికారులు దిగజారడం ఆందోళనకరంగా మారింది. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి కేసులు నమోదు అవుతున్నా.. లంచావతారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు..

ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూనే మరోవైపు లంచాలు తీసుకోనిదే బ్రతకలేని స్థితికి ప్రభుత్వ అధికారులు దిగజారడం ఆందోళనకరంగా మారింది. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి కేసులు నమోదు అవుతున్నా.. లంచావతారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.. తాజాగా నిర్మల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడి ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.

ఒక వ్యక్తికి అనుకూలంగా జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ స్టేట్ టాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ లెక్కల వ్యవహారంలో అనుకూలంగా నివేదిక తయారు చేయాలని మంచిర్యాల పట్టణానికి చెందిన జువెల్లరీ దుకాణం యజమాని లక్కింశెట్టి వీర భాస్కరరావు స్టేట్ టాక్స్ ఆఫీసర్ అధికారులను సంప్రదించారు.

ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులు మొదట లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు.. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ముందస్తు వ్యూహంతో సోమవారం వల పన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల లంచం నగదు స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 వేల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. రసాయన పరీక్షల ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. అనంతరం ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి.. విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తరలించారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

#Nirmal#Commercial Taxes Department#Mancherial#Corruption#ACB#Karimnagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి