తెలంగాణ

Hyderabad: చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు చేసిన అధికారులు.. 100 టన్నులు సీజ్!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

సైబరాబాద్‌లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపించారు. వెటర్నరీ అధికారులతో కలిసి సైబరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.

రోజు రోజుకు లోకంలో పెరిగిపోతున్న అవినీతి, అన్యాయం, ప్రతి అడుగునా రాజ్యమేలుతున్న కల్తీ వ్యాపారం మొదలగు ఘటనలు.. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.. పీల్చే గాలి, తినే అన్నం దగ్గర నుంచి బ్రతికే ప్రతీ క్షణం భయంతోనే గడపాల్సిన పరిస్థితి దాపురించింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ హానికర రాక్షసత్వాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా ప్రజల ఆరోగ్యంతో ఆడే ఆటలు ఆగడం లేదు..

ఇక తాజాగా సైబరాబాద్‌లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపించారు. వెటర్నరీ అధికారులతో కలిసి సైబరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను అధికారులు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. చికెన్ షాపులు, పౌల్ట్రీలకు సంబంధించిన వ్యర్థాలను సేకరిస్తున్న మాఫియా.. వాటిని రాత్రి వేళల్లో లారీల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో సేకరించిన చికెన్ వ్యర్థాలను లారీల్లోకి తరలిస్తున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా చేపల పెంపకంలో చికెన్ వ్యర్థాలను వినియోగించడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, ఇలాంటి వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు. ఇక ఈ అక్రమ కార్యకలాపాలపై గతంలో కేసులు నమోదైనప్పటికీ.. మాఫియా మాత్రం వెనక్కి తగ్గకుండా అదే దందాను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గత నెలలోనే హెచ్-ఫాస్ట్ అధికారులు సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. మళ్లీ అదే తరహాలో వ్యర్థాల రవాణా కొనసాగినట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తనిఖీలు, దాడులు కొనసాగుతాయని, అలాగే ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు...

#Cyberabad#chicken waste#illegal transport#mafia#police#veterinary officials#Attapur#Miyapur#Ameenpur#Kukatpally#Jeedimetla#Chintal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి