Cm Revnath Reddy: తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్రం వివక్షను సహించేది లేదన్నారు.
''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ కు అనుమతి నిరాకరణ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప ప్రధానిగా వ్యవహరించడం లేదు. విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధాని వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే'' అని సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. లండన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
నా పర్యటన అడ్డుకోగలరేమో నా లక్ష్యాన్ని ఆపలేరు
''రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే.. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వివక్షను చూపిస్తోంది అనేది అర్థమవుతుంది. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. పెట్టుబడులన్నీ తెలంగాణకు వస్తే.. గుజరాత్ కు పెట్టుబడులు పోవేమో, కొంత ఇబ్బంది కలుగుతుందేమో అనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. నా పర్యటన అడ్డుకోగలరేమో కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికా పంపా. అక్కడి సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి అన్ని ఆహ్వానాలు అధికారులు అందజేస్తారు.
పెట్టుబడులను గుజరాత్ కు మళ్లించే కుట్ర
తెలంగాణ సీఎంను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. తెలంగాణకు పెట్టుబడులు అడ్డుకోవడమే. గుజరాత్ సీఎంను అనుమతించి, తెలంగాణ సీఎంను అడ్డుకోవడం ఏంటి? పెట్టుబడులను గుజరాత్ కు మళ్లించే కుట్ర. గుజరాత్ ఆధిపత్యానికి ఇది నిదర్శనం. గుజరాత్ నాయకత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది. తెలంగాణ అంటే కేంద్రానికి చులకన, చిన్నచూపు. బీజేపీ ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లొచ్చు. మేము వెళ్లకూడదా?'' అంటే నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
గుజరాత్ సీఎం వెళ్లొచ్చు.. తెలంగాణ సీఎం వెళ్లకూడదా?
''విదేశాంగశాఖకు మా విద్య, క్రీడా రంగ పెట్టుబడులపై వివరాలు ఇచ్చాం. కేంద్రానికి మా ఉద్దేశాన్ని పూర్తిగా వివరించాం. విద్య, స్పోర్ట్స్ అంశాల్లో విదేశీ పర్యటనకు వెళ్తున్నామని అప్లికేషన్ పెట్టాం. ఒకే విధానంతో రెండు దేశాల్లో పర్యటనకు ప్లాన్ చేసుకున్నాం. యూకే ట్రిప్ కి అనుమతి ఇచ్చి అమెరికా టూర్ కు తిరస్కరించడంలో ఆంతర్యమేంటి? తెలంగాణ సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. గుజరాత్ సీఎం 8 రోజుల విదేశీ పర్యటనకు ఎలా అనుమతిచ్చారు? రాజకీయ కోణంలోనే నా పర్యటనకు అనుమతి నిరాకరించారు.
అక్కడే మాట్లాడొచ్చు.. కానీ దేశద్రోహి అంటారు
నా అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడానికి గుజరాత్ ఆధిపత్యమే కారణం. తెలంగాణ అభివృద్ధి చెందితే గుజరాత్ కు ఇబ్బందేమో అని భావించారు. నా పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా రాజకీయ కక్షనే. మోదీ దేశానికి ప్రధాని అయినా ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు. నా పర్యటనను అడ్డుకున్నారు కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. ఇది నన్ను కాదు తెలంగాణను అవమానించినట్లే. విదేశీ వేదికలపైనే మాట్లాడొచ్చు కానీ దేశద్రోహి అంటారు. అందుకే రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నా'' అంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.












