2027 Sankranti: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలకి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రతీ ఏటా ప్రారంభంలో వచ్చే పొంగల్‌కి చిన్న నుంచి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడుతున్నాయి. అలాగే, 2027 సంక్రాంతికి కూడా మెగాస్టార్, సాయి దుర్గ తేజ్, అక్షయ్ ఖన్నా, శర్వానంద్, వెంకటేష్ పోటీ పడబోతున్నారు. ఈ సారి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది.
అందరికంటే ముందు 'మహాకాళి':
బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, సముద్ర ఖని, శ్రీయా రెడ్డి, భూమి శెట్టి ప్రధాన పాత్రల్లో హను-మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వస్తోంది 'మహాకాళి'. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూస్తే ఒళ్ళు గగురుపొడుస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యకావ్యాన్ని మేకర్స్ జనవరి 8, 2027న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
సాయి దుర్గ తేజ్-'సంబరాల ఏటిగట్టు':
మెగా ఫ్యామిలీ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాను కూడా సంక్రాంతి బరిలో దింపబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. జనవరి 12న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. కె.పి.రోహిత్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకి ఈ మధ్యనే విడులతేదీని ప్రకటించారు.
అనిల్ రావిపూడి-వెంకీ కూడా 'జనవరి 12 విడుదల':
ఇప్పటి వరకూ 9 చిత్రాలను తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఈసారి 10వ సినిమాతో వస్తున్నాడు. వెంకటేష్-కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్-కృతీ శెట్టీ నటిస్తున్నారు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి-సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. టైటిల్ నే విడుదల తేదీగా పెట్టి అనిల్ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. 'సంబరాల ఏటిగట్టు'కి ఇది గట్టి పోటీ ఇవ్వబోతుంది.
మెగాస్టార్ 'కాకా':
బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 22న రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రియమణి హీరోయిన్‌గా, అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్నాడు.
జనవరి 14న 'జార్జ్ క్రిష్':
దర్శకుడు శ్రీను వైట్ల చాలా ఏళ్ళ తర్వాత కంబ్యాక్ ఇస్తూ శర్వానంద్ హీరోగా 'జార్జ్ క్రిష్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఘనంగా ప్రారంభమై శరవేగంగా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రాజెక్ట్ ప్రారంభం రోజునే ప్రకటించారు. నాలుగు నెలల వ్యవధిలో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయ్యడం అంటే పెద్ద టాస్కే. కానీ, శ్రీను వైట్ల ప్రకటించాడు కాబట్టి వచ్చేస్తాడు. మొత్తానికి, ఈసారి సంక్రాతికి బాక్సాఫీస్ వద్ద ఫైట్ రసవత్తరంగా ఉండబోతుంది.


