తెలంగాణలో 22ఏ భూముల వివాదం ఇప్పటికే వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. ఈ అంశం పై నిత్యం కథనాలు వెలువడుతుండగా.. అధికారపక్ష కాంగ్రెస్ పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు.. ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ప్రభుత్వ తీరుతో జనానికి అయోమయంతో పాటు ఆందోళన నెలకొంది. అయితే 22ఏ భూముల వివాదం పై తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశం పై ప్రతిపక్షాలు చేస్తున్నది తప్పుడు ప్రచారమని.. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 22ఏ జాబితాలో నిజమైన ప్రైవేట్ భూములు ఉంటే వాటికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు నిరంతరం రివ్యూలు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు.
ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఏరియాల్లో 22ఏ సమస్య జఠిలంగా ఉందని తెలిపిన పొంగులేటి.. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని.. జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్లకు పంపించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.. రిజిస్ట్రేషన్ ఆగిపోయిన ఆస్తికి సంబంధించిన సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు..
అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.. ఇక స్లాట్ బుక్ చేసుకున్న వాటిలో 98 శాతం రిజిస్ట్రేషన్లు క్లియర్ చేశామని.. రిలాక్సేషన్ పరిధిలోకి వచ్చే కేసులను కూడా పరిష్కరిస్తున్నామని పేర్కొన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ జీవోలతో గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
మరోవైపు 22ఏ జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, కాలనీలు చేరడంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ నుంచి 22ఏ జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి సర్వే నంబర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని.. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
అంతేకాదు.. 22ఏ బాధితుల కోసం బీఆర్‌ఎస్ ప్రత్యేక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని ఇదివరకు హరీశ్‌రావు హెచ్చరించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా 22ఏ జాబితాలో చేర్పులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో 22ఏ వ్యవహారం కేవలం రెవెన్యూ సమస్యగానే కాకుండా రాజకీయ వివాదంగా మారింది.
అయితే ప్రభుత్వం మాత్రం ఇది పాత రికార్డులు, అధికారుల పొరపాట్లతో ఏర్పడిన సమస్య అని చెబుతూ.. నిజమైన భూ యజమానులకు త్వరితగతిన న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం అధికారుల తప్పిదం కాదని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని పట్టుబడుతున్నాయి. మరి ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఏమేరకు నష్టం కలిగిస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగవలసిందే..


