హైదరాబాద్ మహా నగరంలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. బిల్డర్, భవన యజమాని పరార్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 40 గజాలలోపు స్థలంలో ఏడంస్తుల నిర్మాణం చేపట్టడం వల్లు ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన నాటి నుంచి యజమాని కోసం గాలిస్తున్నారు. అయితే, దేశం విడిచి పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓనర్ సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే సాజిద్ G+6 భవనం నిర్మించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు.
నాసిరకం మెటీరియల్ వాడి నిర్మాణం చేపట్టినట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే శనివారం ఉన్నపళంగా ఏడు అంతస్తుల భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకుని మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందారు. మృతులు ఉమేష్ ఖారే ,మోహపాల్ భలావిగా గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలాఉండగా, భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్ ఖాజా కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. భవన యజమాని సాజిద్‌ను విచారించాక భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉండగా, కుప్పకూలిన భవనం సమీపంలో మరికొన్ని అక్రమ కట్టడాలు ఉన్నట్టు జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు.సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు సైతం ఆ నిర్మాణాలను పరిశీలించారు.ముందస్తు నోటీసులు ఇచ్చి వాటిని కూడా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఇప్పటికే ప్రకటించగా.. ఆదివారం మరో బిల్డింగును అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.


