సాధారణంగా మున్సిపల్ కార్మికులు ఉదయాన్నే ఐదు గంటలకు విధుల్లో చేరిపోతుంటారు.వారికి పెద్దగా వాహనాలు కూడా ఉండవు.. ప్రభుత్వ వాహనంలో వచ్చి తమ డ్యూటీ చేసుకుని తిరిగి ప్రభుత్వ వాహనం లేదా బస్సుల్లో జర్నీ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొందరు బైకుల మీద వస్తున్నారు. వచ్చామా? అటెండెన్స్ వేసుకున్నామా? తమకు కేటాయించిన ఏరియాలో చెత్త క్లీన్ చేశామా? వెళ్లిపోయామా? ఇదే వారి లైఫ్ స్టైల్.. అయితే, వారికి కూడా పెద్దపెద్ద కోరికలు ఉంటాయని ఎవరికీ తెలియకపోవచ్చు.వారికి కార్లలో తిరగాలని ఉన్నా బయటకు చెప్పుకోరు.
ఎందుకంటే వారు చేసే డ్యూటీ..వారికి వచ్చే ఆదాయం..కుటుంబ పరిస్థితుల కారణంగా ఏది చేయలేకపోతుంటారు. కానీ, ఓ మున్సిపల్ కార్మికుడు మాత్రం అందరిలా ఆలోచించలేదు. తోటి కార్మికులకు భిన్నంగా ఉండాలని కూడా అనుకోలేదు. తాను చేస్తున్న పనికి కారులో తిరిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారా? అని కూడా ఆలోచన చేయలేదు. కేవలం తన సంతోషం, తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు.తను చేస్తున్న వృత్తి పట్ల గర్వం ఉన్న అతను ఎవరికి సమాధానం కూడా ఇవ్వాలనుకోలేదు.
చేసేది మున్సిపల్ కార్మిక వృత్తి అయినా దర్జాగా కారులో తిరగాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఫార్చ్యునర్ కారు కొనుగోలు చేశాడు. అదే కారులో రోజు ఉదయం డ్యూటీకి వచ్చి తన పని ముగించుకుని తిరిగి అదే వాహనంలో ఇంటికి పయనం అవుతున్నాడు.ఈ ఘటన కర్ణాటకలోని బంట్వాళలో వెలుగుచూసింది. పారిశుద్ధ్య కార్మికుడు శేషప్పణ్ణ ప్రతిరోజూ ఫార్చునర్ కారులో చెత్త క్లీన్ చేయడానికి వస్తుంటాడని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1996 నుంచి శేషప్పణ్ణ శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతనికి కార్లు అంటే చాలా ఇష్టమని తెలిసింది.దీంతో లోన్ తీసుకుని తొలుత ఆల్టో, స్కార్పియో, రీసెంట్‌గా ఫార్చునర్ కారు కొనుగోలు చేసినట్టు పారిశుద్ధ్య కార్మికుడు పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనితో పాటు పశువుల పెంపకంతో నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నట్టు శేషప్పణ్ణ వెల్లడించారు.సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ డ్యూటీకి వచ్చే సదరు కార్మికుడిని చూసి అధికారులు సైతం షాక్ అయినట్టు తెలిసింది.అతని కోరిక తెలిసాక వారు సైతం ఏమీ అనలేదని తోటి కార్మికులు వెల్లడించారు.


