ప్రకృతి విపత్తులతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఏదోక ఒక రూపంలో బీభత్సం సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవడం, మరోచోట భీభత్సంగా కురుస్తున్న వర్షాలకు.. పోటెత్తుతున్న వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లడం జరుగుతుంది. ఇలా జనజీవితం ప్రమాదపు అంచున సాగుతుంది. ఇలా ఇప్పటికే ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న విపత్తులు.. తాజాగా మరో విధ్వంసం సృష్టించాయి.
పశ్చిమ ఆఫ్రికాలోని గినియా రాజధాని కోనక్రీలో ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని దార్ ఎస్ సలామ్ లో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ లో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా కూలిపోయి.. సమీపంలోని పూరి గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
మరోవైపు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి కొండలా మారిన చెత్త పూర్తిగా తడిసిపోయి.. కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. డంపింగ్ యార్డును మూసివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించేందుకు ముందుగానే నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో కొందరు అక్కడి నుంచి వెళ్లిపోగా.. మరికొందరు ఇళ్లు ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుని 30 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది... మరోవైపు ఈ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షాలకు కొండ చరియలు సైతం విరిగిపడి 22 మందికిపైగా మృతి చెందారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాలు మరి కొన్ని రోజులు కురిసే ప్రమాదం ఉన్న తరుణంలో రాజధాని లోని ఇతర ప్రాంతాల్లో వారికి తాత్కాలికంగా పునరావాసం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక గినియా అనేది పశ్చిమ ఆఫ్రికాలోని అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడి ప్రజలు అధికంగా ఫ్రెంచ్ మాట్లాడుతారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం గినియా జనాభా కోటీ 54 లక్షలుగా ఉందని స్థానిక పత్రికల కథనం..
ఇక ఇప్పటికే పలు దేశాల్లో డంపింగ్ యార్డులు కొండల్లా పేరుకుపోయాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన ఆయా దేశాలు, రాష్ట్రాల అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.












