తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర సంచలనం సృష్టించాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. రామగుండానికి చెందిన ముజామిల్ ఖాన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థికి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్‌లతో అండర్‌గ్రౌండ్ లింకులు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అయోధ్య నగర్‌లోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించి, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ముజామిల్ ఖాన్‌ను ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎన్‌ఐఏ అధికారులు తీవ్రస్థాయిలో విచారిస్తున్నారు. ఉగ్ర సంస్థలతో అతనికి ఏ విధమైన సంబంధాలున్నాయి? ఎవరితోనైనా కుట్రలకు తెరలేపాడా? లేదా సోషల్ మీడియా వేదికగా ఎవరి ప్రభావంతోనైనా ఈ మార్గంలోకి వెళ్లాడా? అనే కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించి రాష్ట్రంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో మరెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. రామగుండం లాంటి పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థిని ఉగ్ర లింకుల ఆరోపణలతో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












