హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్లో పనిచేస్తున్న ఓ యువతి మరణించిన విషయ తెలిసిందే.ఈ ప్రమాదానికి కారకుడైన సంజూష్..ఏపీ జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు కావడం గమనార్హం. ప్రమాదం జరిగి ఐదు రోజులు దాటినా పోలీసులు ఆయన్ను అరెస్టు చేయకపోవడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అయితే, కారు యాక్సిడెంట్ చేసి ఓ ప్రాణం పోవడానికి కారకుడైన వ్యక్తిని విడిపించేందుకు అతని తండ్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
కొడుకు మీద అసలు కేసు లేకుండా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్టు టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఏకంగా పోలీసులతో డీల్స్ మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా’ అని మాదాపూర్ పోలీసులకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ ఆఫర్లు ఇస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
స్టేషన్ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబానిది ఒకే సామాజికవర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 16వ తేదీన ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగి భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా వచ్చి కారుతో ఢీకొట్టిన ఘటనలో లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ నిందితుడిగా ఉన్నాడు.ఈ కేసులో కేవలం స్టేషన్ బెయిల్ వచ్చేలా BNS 106(1) కింద కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చి మాదాపూర్ పోలీసులు వదిలేశారని సమాచారం.
సాధారణంగా ఇలాంటి ఘటనల్లో BNS 105, మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉండగా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజుష్ రక్త నమూనా వచ్చాక కొత్త సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పడంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు నిందితుడి కుటుంబ సభ్యులతో స్టేషన్ ఉన్నతాధికారి, కిందిస్థాయి సిబ్బంది డీల్ కుదుర్చుకున్నారని మరో ఉన్నతాధికారి వెల్లడించినట్టు సమాచారం.
అందుకే ప్రమాదం జరిగినా 5 రోజుల పాటు వివరాలు బయటికి రానివ్వలేదని, సంజుష్ స్థానంలో మరో ప్రైవేట్ డ్రైవర్‌ను పెట్టి కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలు బయటికి రావడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చినట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు 80 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు ఇవ్వలేమని రవాణా శాఖ అధికారుల వెల్లడించారు. అంత రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ఏంటని, కెమెరాలు కూడా మాయం చేశారా? అంటూ సామాన్య ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












