రాష్ట్రంలో జోరుగా సన్నబియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కర్ణాటకకు పెద్దఎత్తున పీడీఎస్ రైస్ సరఫరా అవుతున్నట్టు సమాచారం.కేవలం వికారాబాద్ జిల్లాలోనే ప్రతినెలా రూ.10 కోట్ల సన్న బియ్యం అక్రమ దందా అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో కొందరు దుండగులు అక్రమాలకు తెర లేపినట్టు సమాచారం.
ప్రతీ కుటుంబానికి దాదాపు 50 నుంచి 100 కేజీల సన్న బియ్యం రావడంతో వారి నుంచి ఒక్కో కేజీ రూ.10 నుంచి రూ.12కే కొనుగోలు చేసి అనంతరం దానిని దళారులు క్యాష్ చేసుకుంటున్నట్టు తెలిసింది. గ్రామాల్లో ఉదయమంతా తిరిగి బియ్యం సేకరించి, రాత్రికి రాత్రే కొడంగల్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్టు సమాచారం.రూ.10కి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, కర్ణాటకలోని గుర్మిట్కల్ మార్కెట్లో కేజీ బియ్యం రూ.40కి విక్రయిస్తున్నట్టు తెలిసింది.
కేవలం వికారాబాద్ జిల్లాలోనే దాదాపు 50% రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ రూ.10 కోట్ల దందాకు తెరలేపినట్టు సమాచారం. గుల్బర్గా, గుర్మిట్కల్ ప్రాంతాలు కొడంగల్‌ను ఆనుకుని ఉండడం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో అక్రమంగా సన్న బియ్యం దందాను దగ్గరుండి కొడంగల్ వ్యాపారులు నడిపిస్తున్నట్టు తెలిసింది.
రాజకీయ అండదండలతో అధికారులను మేనేజ్ చేస్తూ ఈ దందాను దళారులు కొనసాగిస్తున్నట్టు సమాచారం.కొడంగల్ నుంచి గుల్బర్గా వెళ్లి దారిలో ఉన్న కస్తూర్‌పల్లి చెక్‌పోస్ట్, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మేడక్ చెక్‌పోస్ట్ ఎత్తివేయడంతో బియ్యం అక్రమ రవాణా సాఫీగా సాగుతున్నట్టు తెలిసింది. మధ్యలో ఇలాగే మీడియాలో కథనాలు వస్తే అప్పటిమందం అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత కమీషన్లు దండుకుని బియ్యాన్ని బోర్డర్ దాటించేందుకు సహకారం అందిస్తున్నట్టు సమాచారం.ప్రతినెలా రూ.10 కోట్ల చొప్పున ఏడాదికి రూ.వందల కోట్లలో అక్రమంగా రేషన్ బియ్యం దందా నడిపిస్తున్నట్టు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇదంతా జరుగుతున్నా..ఆయనకు తెలీకుండా ఉంటుందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


