దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు ఎలాంటి కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. గతేడాదిగా ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న పాత వేరియంట్‌నేనని, దీనిపై ప్రజలు ఎలాంటి అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం బాధితుల్లో గుర్తించిన వైరస్‌లు ప్రధానంగా 'ఎ/మిస్సోరి/11/2025 (H1N1) పిడిఎమ్09' తరహా వైరస్ స్ట్రెయిన్‌కు చెందినవిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి క్లేడ్ 6B.1A.5a2a, సబ్‌క్లేడ్ D.3.1.1 వర్గానికి చెందినవని, ఇవి 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లలో భాగమేనని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్న H1N1 వైరస్‌లు.. ఉత్తరార్ధగోళానికి నిపుణులు సిఫార్సు చేసిన సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్‌లోని H1N1 స్ట్రెయిన్‌తో చాలావరకు సరిపోలుతున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
సాధారణంగా స్వైన్ ఫ్లూ అని కూడా పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్‌లో తీవ్రమైన జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. చాలా మందిలో తగిన విశ్రాంతి తీసుకోవడం, సరిపడా ద్రప పదార్థాలు సేవించడం, వైద్యుల సలహా మేరకు మందులు వాడడం ద్వారా ఈ వ్యాధి సులభంగా తగ్గుతుందని వెల్లడించారు. అయితే, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో దేశంలోని పలు ప్రధాన నగరాలు, రాష్ట్రాల్లో సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1,777 కేసులు వెలుగుచూడగా, కర్ణాటకలో ఈ సంఖ్య 4,000 దాటింది. ముంబై, చెన్నై, కేరళ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అధిక ముప్పు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వార్షిక ఫ్లూ టీకా తీసుకోవాలని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్ర లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


