తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న కరెంట్ సబ్సిడీని ఎత్తేయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకే ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
దీనిలో భాగంగానే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల నెక్లెస్ రోడ్డులో స్మార్ట్ మీటర్ల ఉపయోగం పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉందని పదే పదే నిరూపించుకుంటోందని ఆరోపించారు.
స్మార్ట్ మీటర్లు తేవడం ద్వారా ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసిందని,అందుకే ఒక్కసారిగా తేకుండా ఇలా ప్రదర్శనల పేరిట ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కార్పొరేట్లతో కుమ్మకై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజల నుంచి మరల బిల్లులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేంద్రం ముందు మోకరిల్లిన రేవంత్ సర్కార్.. వాళ్లు తీసుకొస్తున్న తలా తోక లేని విధానాలను సమర్థిస్తోందని కవిత ఫైర్ అయ్యారు.
https://x.com/RaoKavitha/status/2091771760375140729?s=20
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మీటర్లు అన్ని స్మార్ట్ అని.. రీడింగ్ కోసం పెన్ను పేపర్‍తో ఏమీ రాయడం లేదు కదా? అని ప్రశ్నించారు. గతంలో కేంద్రం రైతు చట్టాల పేరిట స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూసిందో అదే అదానీ కంపనీకి చెందిన స్మార్ట్ మీటర్లను మరో కొత్త స్కీం పేరిట కేంద్రం తీసుకురావాలని చూస్తుందని కవిత ఆరోపించారు.అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం పెట్టి మరీ వచ్చిందని, ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అదానీలకు కొమ్ము కాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.


