గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికార కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడం తెలిసిందే..
అనంతరం మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ కావడం.. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ వివరణ ఇవ్వడం.. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందంటూ అధిష్ఠానానికి లేఖ రాయడం.. ఇలా వరుస పరిణామాలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కొండా సురేఖపై అసమ్మతి వర్గం బహిరంగంగానే గళం విప్పింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు పార్టీలో అసమ్మతి స్వరం.. మరోవైపు పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన నివేదిక.. ఈ నేపథ్యంలో కొండా సురేఖా పై ప్రస్తుతం అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకుంటే.. కొండా కుటుంబం నెక్ట్స్ స్టెప్ ఏంటి? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి..అయితే తాజాగా కొండా సుస్మిత కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టనుందనే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో కొండా సుస్మిత జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. జూబ్లీహిల్స్‌లో జనసేనకు చెందిన కీలక నేతతో ఆమె భేటీ కానున్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో పరకాల అసెంబ్లీ టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి కీలక బాధ్యతల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మరోవైపు తెలంగాణలో జనసేన రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. వరంగల్ ప్రాంతంలో రాజకీయంగా పరిచయం ఉన్న కుటుంబానికి చెందిన నాయకత్వం పార్టీలో చేరితే అది జనసేనకు కూడా బలాన్నిచ్చే అంశంగా మారొచ్చని కొండా సుస్మిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కల్యాణ్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అభిమాన వర్గం సపోర్టు కూడా లభించే అంశాలను సుస్మిత పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో జనసేనలో కీలకంగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే పరకాల నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న సుస్మిత.. కాంగ్రెస్‌లో ఆమె తల్లి మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. భవిష్యత్ రాజకీయ అవకాశాలను నిర్మించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టు చర్చ జరుగుతుంది.. ఇక కాంగ్రెస్‌కు కూడా ఇది సవాలుగా మారనుందని అంటున్నారు.. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మారతాయి? ఆమె కుటుంబం ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఎంచుకుంటే దాని ప్రభావం వరంగల్ రాజకీయాలపై ఎంతవరకు పడుతుంది? అనే కోణంలో ఆలోచించి అధిష్ఠానం నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని పొలిటికల్ వర్గాలలో చర్చ మొదలైంది.
ముఖ్యంగా కొండా సురేఖ బీసీ నాయకురాలు కావడం, వరంగల్ ప్రాంతంలో ఆమెకు ఉన్న రాజకీయ పరిచయం, కుటుంబానికి ఉన్న క్యాడర్ బేస్ వంటి అంశాలను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రాజకీయాల్లో ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కొండా కుటుంబం విషయంలో ఇప్పుడు ఆ నెక్ట్స్ డోర్ జనసేన అవుతుందా? లేక కాంగ్రెస్‌లోనే కొత్త రాజకీయ రాజీకి మార్గం ఏర్పడుతుందా? అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది..


