Bangladesh Hindu Family: బంగ్లాదేశ్ లో హిందూ ఫ్యామిలీ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబాన్ని చంపిన దుండగులు ఆ తర్వాత అదే ఇంట్లో ఉండి చేసిన పనులు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. కుటుంబాన్ని హత్య చేశాక రాత్రి అదే ఇంట్లోనే గడిపారు. అక్కడే స్నానం చేశారు. ఫ్రిజ్ లో ఉన్న ఆహారం తిన్నారు. అంతేకాదు అక్కడే డ్రగ్స్ కూడా తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. వెళ్లిపోయే ముందు ఇంట్లోని వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసిపోయారు. బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లారు. ఫోన్లను మాత్రం డిటర్జెంట్ కలిపిన నీటిలో పడేసి ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు.
రిటైర్డ్ స్కూల్ టీచర్ కుటుంబం దారుణ హత్య
బంగ్లాదేశ్ లోని రంగ్ పూర్ నగరంలో నివాసం ఉండే హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. కుటుంబంలోని నలుగురిని అత్యంత కిరాతకంగా చంపారు. మృతులను రిటైర్డ్ స్కూల్ టీచర్ గణపతి చక్రవర్తి(65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి(50), పిల్లలు అగామి (23), ప్రియమ్(12) గా గుర్తించారు. ప్రీతి, అగామి మృదేహాలు మెట్లపైన.. గణపతి మృతదేహం ఇంటిపైన, ప్రియమ్ డెడ్ బాడీని మంచం కింద గుర్తించారు. గొంతు నులిమి వారిని చంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.
ప్రశ్నించడమే ప్రాణం తీసింది
''రంగ్‌పూర్ నగరంలో తాళం వేసి ఉన్న తమ ఇంట్లోనే నలుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. డ్రగ్స్ సేవించేందుకు తమ ఇంటి పైకప్పుపైకి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించినందుకు రిటైర్డ్ స్కూల్ టీచర్ గణపతితో పాటు అతడి కుటుంబంలోని ముగ్గురు సభ్యులు హత్యకు గురయ్యారు. మండే స్వభావం గల పదార్థాన్ని ఉపయోగించి వారి ముఖాలను కాల్చివేశారు. ఈ హత్యలకు సంబంధించి సిద్ధార్థ్ దాస్ (19), ముగ్ధ దాస్ (23) అనే ఇద్దరు అనుమానితులను (వీరు కజిన్స్) అరెస్ట్ చేశాం'' అని పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ సేవించేందుకు ఇంటిపైకి వచ్చి దారుణం
''రంగపూర్‌లోని మచువాపరా ప్రాంతంలో చక్రవర్తి కుటుంబం రెండంతస్తుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆ టిపైకి.. ముగ్ధో, సిద్ధార్థ అనే వ్యక్తులు 'యాబా' (ఒక రకమైన మాదకద్రవ్యం) సేవించడానికి ఎక్కారు. పై అంతస్తు నుండి శబ్దాలు వినిపించడంతో ఏం జరుగుతుందో చూసేందుకు గణపతి చక్రవర్తి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో చక్రవర్తి తనతో తెచ్చుకున్న టవల్‌ను ఉపయోగించి నిందితులు ఆయనను గొంతు నులిమి చంపారు. ఆ శబ్దాలు విని చక్రవర్తి భార్య కూడా మేడపైకి వెళ్లగా ఆమెను కూడా చంపేశారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గదిలోంచి బయటకు వచ్చిన ఆ దంపతుల కుమార్తెపైనా నిందితులు దాడి చేశారు. తాడుతో గొంతు నులిమి చంపేశారు. తమను గుర్తుపడతాడనే భయంతో ఆ దంపతుల 12ఏళ్ల కుమారుడిని కూడా వారు హతమార్చారు.
దర్యాఫ్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం
హత్యల తర్వాత ఆ ఇద్దరు అనుమానితులు రాత్రంతా ఇంట్లోనే ఉన్నారు. అక్కడే స్నానం చేశారు. ఫ్రిడ్జ్ లో ఉన్న ఖర్జూరాలు, దోసకాయలు వంటి ఆహారాన్ని తిన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే మత్తు పదార్థాలను కూడా సేవించారు. అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడానికి వారు అల్మారాలు, డ్రాయర్లు తెరిచి బట్టలు, ఇతర వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. బాధితుల ఇంటి నుండి బంగారు ఆభరణాలను కూడా దోచుకున్నారు. కుటుంబానికి చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను డిటర్జెంట్ కలిపిన నీటిలో ముంచి ధ్వంసం చేశారు'' అని పోలీసులు వెల్లడించారు.
నేరాన్ని అంగీకరించిన నిందితులు
నిందితుల్లో సిద్ధార్థ్ చేపల వ్యాపారం చేస్తాడు. ముగ్ధ స్వర్ణకారుడు. లభించిన ఆధారాల ఆధారంగా పోలీసులు సిద్ధార్థ్, ముగ్ధలను అరెస్ట్ చేశారు. ఆ హత్యలు తామే చేసినట్లు వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. బాధితుల ఇంటి నుండి దోచుకున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఖర్జూర గింజల ద్వారా హంతకుల DNAను పరీక్షిస్తున్నారు.


