CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ అంశం పార్టీ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే అని తేల్చి చెప్పారు. పార్టీ అంతర్గత అంశాలపై తాను మాట్లాడనని పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి అని మీడియాకు రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ పై సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు
కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ టార్గెట్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. కొండా సుస్మిత తల్లి, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ నోటీసులకు కొండా సురేఖ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు. తన కుమార్తె చేసిన కామెంట్స్ కు తనను బాధ్యత వహించాలనడం సమంజసం కాదని, తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు.
కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్
కొండా సురేఖ ఇచ్చిన రిప్లయ్ పై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ తీరు కరెక్ట్ కాదన్నారు. కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. నాకేం సంబంధం అని అనడం దారుణం అన్నారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఎపిసోడ్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక కొండా సురేఖ అంశంపై ఏ విధంగా రియాక్ట్ అవుతారోనని ఉత్కంఠ నెలకొంది.
అయితే, అందుకు భిన్నంగా ఆయన రియాక్షన్ ఉంది. కొండా సురేఖ అంశం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని ప్రకటించారు. లండన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కొండా సురేఖ అంశాన్ని మీడియా ప్రస్తావించింది.












