* మీ పాలనలో చేసిన దోపిడీ, భూకబ్జాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయ్
* సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
* మోదీ ఇంటికి పోవడం ఖాయం
* ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?
* పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
* విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం
* అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా కాంగ్రెస్ క్యాడర్ పని చేయాలి
* అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు
Mahesh Kumar Goud: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన వాళ్లు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అజెండా అని స్పష్టం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాలకు ఊపు తీసుకురావడమే లక్ష్యంగా సోమవారం మెదక్‌లోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ మీడియా ప్రచారం, ఓటర్ల జాబితా, పార్టీ క్యాడర్ పనితీరుపై చర్చించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి మహేష్‌కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ, భూకబ్జాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేటీఆర్ సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకున్నారని విమర్శించారు.
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు
''గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నెలలో 20వ తేదీ వరకు కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేది. గ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా ఎంతమంది రైతులపై కేసులు పెట్టారో బీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది'' అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా మహేష్‌కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సమాధానం చెప్పాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన పలు కంపెనీలు, సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అప్పగించిందన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, మోదీని ఇంటికి పంపడం ఖాయమని మహేష్‌కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనన్నారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు ఎందుకు తీసుకుంటూన్నారని నిలదీశారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని చెప్పారు.
అర్హులైన పేదలకు ఇల్లు లేని పరిస్థితి ఉండకూడదు
తెలంగాణలో అర్హత కలిగిన ఏ పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో రాజయ్య, ఈటల రాజేందర్ వంటి నేతలను ఆకస్మికంగా తొలగించారని గుర్తుచేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
హద్దులు దాటితే ఎంతటివారైనా ఉపేక్షించం
పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించరాదని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో హద్దులు దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు వస్తాయని మహేష్‌కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఓపిగ్గా ఉండాలని సూచించారు. “ఇది సీఎం మాట.. నా మాట.. మీనాక్షి నటరాజన్ మాట” అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండాలి
ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు.. ఓటు జాబితాలో ఉండేలా పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడడంతో పాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


