పొరపాట్లు జరగడం సహజం.. కానీ ఆ పొరపాట్లను ఇతరులు ఎదుర్కొనే విధానం మనకు కొన్నిసార్లు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలను నేర్పుతుంది. బెంగళూరులో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటనే దీనికి నిదర్శనం. మాన్సీ శర్మ అనే మహిళ పొరపాటున బ్లింకిట్(Blinkit) యాప్‌లో తప్పుడు అడ్రస్‌కు ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే, ఆ తర్వాత డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు ఆమెను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద చదువులు చదివిన వారికే ఒక గొప్ప పాఠం నేర్పేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన రైడర్ ఫోన్ చేయడంతో మాన్సీ తాను తప్పు చిరునామా ఇచ్చినట్లు గుర్తించింది. అసలు అడ్రస్ అక్కడి నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కాస్త దూరానికి రైడర్లు సాధారణంగా నిరాకరిస్తుంటారు, కానీ ఆ డెలివరీ బాయ్ ఏమాత్రం విసుక్కోకుండా అదనపు దూరం ప్రయాణించి ఆమె ఇంటికి ఆర్డర్‌ను చేర్చాడు. అతని శ్రమను చూసి కృతజ్ఞతగా మాన్సీ రూ.100 టిప్ ఇవ్వబోగా, అతను ఆ డబ్బును తీసుకోవడానికి సున్నితంగా తిరస్కరించాడు.
పైగా అతను చెప్పిన మాటలు మాన్సీ ఆశ్చర్యపోయింది. "గత నెలలో నా రేటింగ్ 4.2 మాత్రమే ఉండేది. కానీ కస్టమర్ల అవసరాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభించాక ఇప్పుడు నా రేటింగ్ 4.8కి చేరింది. వినియోగదారుల కోసం మనం కొంచెం కష్టపడితే పెరిగే ఆ రేటింగే నాకు అసలైన ప్రశంస, అదే చాలు" అని అతను బదులిచ్చాడు. డబ్బు కంటే కస్టమర్ సంతృప్తికే తాను ప్రాధాన్యత ఇస్తానని, మంచి రేటింగ్ ఇస్తే చాలని కోరాడు.
పని పట్ల అతనికున్న ఈ అంకితభావం, ఆలోచనా విధానం మాన్సీని ఎంతగానో కదిలించింది. తాను ఒక ఎంబీఏ(MBA) గ్రాడ్యుయేట్ అయినప్పటికీ.. నిజమైన పనితీరు, కస్టమర్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో ఆ డెలివరీ బాయ్ ప్రాక్టికల్‌గా నేర్పాడంటూ ఆమె ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. డిగ్రీలు, సర్టిఫికేట్ల కంటే చేసే పనిపై ఉండే శ్రద్ధ, నిబద్ధతలే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడతాయని నెటిజన్లు కూడా సదరు డెలివరీ బాయ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.












