భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వాడుతున్న వారికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఒక సూపర్ న్యూస్ చెప్పింది. తమ అధికారిక 'మైహ్యుందాయ్' (myHyundai) యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా 30,000కు పైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
వివిధ ప్రముఖ చార్జ్ పాయింట్ ఆపరేటర్లతో కుదుర్చుకున్న భాగస్వామ్యం ద్వారా దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా హ్యుందాయ్ ఈ ఘనత సాధించింది. ఈ సరికొత్త సేవల్లో అత్యంత విశేషమైన విషయమేమిటంటే, ఈ చార్జింగ్ నెట్‌వర్క్ కేవలం హ్యుందాయ్ కార్లకే పరిమితం కాకుండా, దేశంలోని అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
దీనివల్ల ఈవీ యూజర్లు తమకు దగ్గర్లోని చార్జింగ్ స్టేషన్లను సులభంగా గుర్తించడంతో పాటు, యాప్ ద్వారానే ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవడం, డిజిటల్ పద్ధతిలో బిల్లులు చెల్లించడం వంటి పనులను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుత నెట్‌వర్క్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక చార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంటుందని, ముఖ్యంగా ఢిల్లీ-జైపూర్, ముంబై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు వంటి ప్రధాన హైవే కారిడార్లలో ఈ సేవలు విస్తరించాయని కంపెనీ పేర్కొంది.
భారత్‌లో ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అడుగు వేసినట్లు హ్యుందాయ్ ఇండియా ఎండీ, సీఈఓ తరుణ్ గర్గ్ తెలిపారు. చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేందుకు ఈ ఓపెన్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య స్టేషన్లతో పాటు కంపెనీ తన సొంత డీసీ ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా భారీగా పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 183 సొంత స్టేషన్ల సంఖ్యను 2030 నాటికి 600కు చేర్చాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.












