విదేశాల్లో చదవాలని.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడని యువత ఉంటుందా?.. అందుకే ఈ లక్ష్యంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకే పరిమితమైన ఈ ధోరణి.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ వంటి ఎన్నో రంగాలకు విస్తరించింది.
విదేశీ డిగ్రీతో పాటు అంతర్జాతీయ అనుభవం, మెరుగైన కెరీర్ అవకాశాలు, శాశ్వత నివాసానికి అవకాశం వంటి అంశాలు భారతీయ యువతను విదేశీ విద్య వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా చాలా కాలంగా భారతీయ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచింది. నాణ్యమైన విద్య, చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు, సులభమైన పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ విధానం కారణంగా వేలాది మంది విద్యార్థులు కెనడాను ఎంచుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
కెనడా ప్రభుత్వం తన 2026–2028 ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే కొత్త స్టడీ పర్మిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తోంది. దీంతో ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై కనిపిస్తోంది. 2024 ఏప్రిల్‌లో భారతీయులకు జారీ చేసిన స్టడీ పర్మిట్లు 36 వేలకుపైగా ఉండగా... 2025 ఏప్రిల్ నాటికి అవి 7 వేల లోపుకు పడిపోయాయి. 2026 ఏప్రిల్‌లో ఆ సంఖ్య మరింత తగ్గి సుమారు 5 వేల 800కు చేరింది. ఇందులో కొత్త పర్మిట్లతో పాటు రెన్యువల్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఒకప్పుడు కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండేవారు. 2018లో చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరిన భారతీయుల వాటా.. 2022లో 41 శాతానికి పైగా నమోదైంది. కానీ విదేశీ ప్రభుత్వ నిర్ణయాలతో 2025 నాటికి ఆ వాటా గణనీయంగా తగ్గింది. అలాగే కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా లక్షల్లో తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్టడీ పర్మిట్ తిరస్కరణల రేటు కూడా పెరుగుతోంది.
అయితే ఈ మార్పులు కేవలం కెనడాకే పరిమితం కావడం లేదు. భారత విద్యార్థులు ఎక్కువగా ఎంచుకునే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. బ్రిటన్‌లో భారత విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతుండగా.. ఆస్ట్రేలియా భారత విద్యార్థుల వీసా దరఖాస్తులను 'హైయెస్ట్ రిస్క్' కేటగిరీలోకి మార్చింది. ఈ పరిణామాలు విదేశాల్లో ఉన్నత విద్యపై ఆశలు పెట్టుకున్న భారత విద్యార్థులకు కొత్త సవాళ్లను తీసుకొస్తున్నాయి.
అందువల్ల కోర్సు ఎంపికతో పాటు దేశాల వీసా విధానాలు, ఉద్యోగ అవకాశాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ముందుగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు గతంలో కంటే మరింత కీలకంగా మారింది. అలాగే ఇప్పుడు విదేశాల్లో చదవాలనే ఆశలను ఒక దేశంపైనే పెట్టుకోకుండా ఉండటం మంచిదని అంటున్నారు..












