రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి..?
అమరావతి వద్దు.. CRDA ముద్దా..?
మావిగన్ అంటున్న జగన్
CRDAకు వ్యతిరేకం కాదంటున్న వైవీ సుబ్బారెడ్డి
కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా.. క్లారిటీతోనే ఉన్నారా..?
వైసీపీకి అప్పుడు ఇప్పుడూ రాజధానే మేజర్ ఎజెండా. గత ఎన్నికల ముందు మూడు రాజధానుల పేరుతో ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఇబ్బంది పడింది. ఇప్పుడేమో ఆ పార్టీ అధినేత జగన్ మావిగన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మూడు రాజధానుల పేరు చెప్పినా, మావిగన్ ప్రకటన చేసినా.. అమరావతికి మాత్రం వ్యతిరేకమనే విషయం స్పష్టమవుతోంది. ఈ విషయంలో పార్టీ అధినేత జగన్‌కు క్లారిటీ ఉంది. మరి రాజధానిపై ఆ పార్టీ నేతలకు క్లారిటీ ఉందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఎందుకంటే పార్టీలో కీలక నాయకులు చేస్తున్న కొన్ని ప్రకటనలు కార్యకర్తలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయట. రాజధాని విషయంలో ఏదో ఒక క్లారిటీ స్టాండ్ తీసుకుంటేనే జనాల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అగ్ర నాయకత్వానికి చెబుతున్నారట.
CRDAకు వ్యతిరేకం కాదు: వైవీ సుబ్బారెడ్డి
తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంతం ప్రస్తుతం ఉన్న సీఆర్‌డీఏ పరిధిలోనే ఉందని… దీనిని తాము వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. అందుకే జగన్ కూడా మావిగన్ ప్రతిపాదన చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చిందని కూడా వైవీ చెప్పుకొచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ.. అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఆర్‌డీఏ ఓకే కానీ, అందులో ఉన్న అమరావతి ఏం చేసిందని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. అప్పుడు మూడు రాజధానుల అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారనీ క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో మరోసారి రాజధాని అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదని టీడీపీ, జనసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టేందుకు వైసీపీ నాయకులు అష్టకష్టాలు పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పరంగా పక్కా స్టాండ్ తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు, కార్యకర్తలు అధినేత ముందు మొర పెట్టుకుంటున్నారట.
జగన్‌కు క్లారిటీ
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్‌కు మాత్రం క్లారిటీ ఉంది. అందుకే ఆయన మావిగన్‌పై స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికలకు ఆ నినాదంతోనే ప్రజల ముందుకు వెళతామని కూడా తేల్చిచెప్పారు. ఎంత ధీమా లేకపోతే ఓ పార్టీ అధినేత అలాంటి ప్రకటన చేస్తారు. అమరావతి పేరుతో టీడీపీ దోచుకుంటుందనేది జగన్ వాదన. కొత్త నిర్మాణాల పేరుతో ఖజానా ఖాళీ చేస్తున్నారని, తాము చెప్పినట్టు మావిగన్ విధానాన్ని అవలంభిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదని చెబుతున్నారు. మావిగన్ వల్ల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని, పెద్దగా కొత్త నిర్మాణాలు కూడా ఉండవనేది వైసీపీ అధినేత చెబుతున్న మాటలు.
ఆయన ప్రకటనకు ఆయన కట్టుబడి ఉన్నారు. కాకపోతే.. ఈ విషయంలో పార్టీ పెద్దలే నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించడం లేదనేది అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజధాని అనేది అత్యంత కీలకమైన అంశం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అంశంపై పార్టీకి క్లారిటీ లేకపోతేనే ఇబ్బంది. ఇప్పుడు వైసీపీలో కూడా అదే జరుగుతున్నట్టుంది. మావిగన్ అనే అంశాన్ని ఎజెండాగా తీసుకున్నాక సీఆర్‌డీఏ, అమరావతి గురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఎవరైనా వైసీపీ నాయకుడు ఈ అంశాలపై మాట్లాడినప్పుడే ఇలాంటి చర్చ వస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సీఆర్‌డీఏ అంశాన్ని ప్రస్తావించడం, దానికి తమ పార్టీ అనుకూలమే అని చెప్పడం టీడీపీకి కలిసొచ్చింది. వెంటనే ఆయన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ టీడీపీ నాయకులు రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు.
అమరావతి Vs మావిగన్
ఒక్కటి మాత్రం క్లారిటీగా అర్థమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అన్నట్టుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న అంశం అమరావతి. జగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మావిగన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ అంశంతోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలు రాజధాని చుట్టే తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే పార్టీ స్టాండ్ ఏంటన్నది ముందుగా నాయకులకు, కార్యకర్తలకు చెప్పాలి. అప్పుడే కన్‌ఫ్యూజన్ ఉండదు. లేదంటే ఎవరో ఒక నాయకుడు ఏదో ఒక ప్రకటన చేయడం, టీడీపీ దానిని హైలెట్ చేసి రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటుంది.












