తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని స్టేట్ బీజేపీ ఇన్‌చార్జి అభయ్ పాటిల్ రెండ్రోజుల కింద కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్యగల మనస్పర్దలకు ఆయన పరిష్కారం చూపడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని, క్షేత్రస్తాయిలో మార్పులు చేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. "అబ్ కీ బార్ మోదీ సర్కార్" అనే బలమైన నినాదంతో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కార్వాన్ నియోజకవర్గ పరిధిలో జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల భేటీకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకప్పుడు అమర్ సింగ్ నాయకత్వంలో గుడిమల్కాపూర్–కార్వాన్ ప్రాంతంలో బీజేపీ గొప్ప విజయాలు సాధించిందని.. దివంగత నేత బద్దం బాల్‌రెడ్డి హయాంలో కార్వాన్‌లో పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలని, ఆ లక్ష్యంతో అడుగులు వేయాలని ఈటల స్పష్టంచేశారు.క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.నియోజకవర్గ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ వంటి సీనియర్ అగ్రనాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.












