అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఎఫ్-1 (స్టూడెంట్), జే-1 (రిసెర్చ్) వీసాల గరిష్ఠ కాలపరిమితిని కేవలం నాలుగేళ్లకు పరిమితం చేస్తూ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" (చదువు పూర్తయ్యే వరకు దేశంలో ఉండే వీలు) విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య వారం నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.
ఈ తాజా నిబంధన ప్రకారం విద్యార్థులు ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), ఎస్‌టీఈఎం ఓపీటీలతో కలిపి గరిష్ఠంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండటానికి అర్హులు. కోర్సు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించేశారు. ఒకవేళ వీసా గడువు పొడిగించుకోవాలంటే విద్యార్థులు విధిగా యూఎస్‌సీఐఎస్ వద్ద ఫారం I-539 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల విద్యార్థులు తమ డిగ్రీలు, పరిశోధనలు పూర్తికాకముందే చదువు మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై భారత సంతతికి చెందిన పాలసీ గ్రూప్ ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (ఎఫ్ఐఐడీఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలో ఒక బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కావడానికి సగటున 52 నెలలు, పీహెచ్‌డీకి 5.7 ఏళ్లు, అలాగే వైద్య శిక్షణ వంటి ఇతర పరిశోధనలకు 5 నుంచి 7 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. అటువంటప్పుడు ఈ నాలుగేళ్ల పరిమితి ఏమాత్రం సరిపోదని, ఇది విద్యార్థుల విద్యా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా అమెరికా ఆవిష్కరణల సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది.
యూఎస్‌సీఐఎస్ వద్ద ఇప్పటికే 1.1 కోట్లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, కేవలం వీసా పొడిగింపు ప్రక్రియకే ఏడాది సమయం పడుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు నిరంతరం వీసా అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితంగా అనేక పరిశోధనశాలలు కీలక నిపుణులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గడం వల్ల అమెరికాకు భారీగా ఆదాయ నష్టం, ఉద్యోగాల కోత ఏర్పడిందని, తాజా నిర్ణయంతో పరిశోధన రంగం మరింత సంక్షోభంలో పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త నిబంధన అమలును తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఐఐడీఎస్ అమెరికా అధికారులను కోరింది. పాత ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని పునరుద్ధరించాలని, 48 నెలల కంటే ఎక్కువ సమయం పట్టే గ్రాడ్యుయేట్, ఎస్‌టీఈఎం ప్రోగ్రామ్‌లకు చట్టపరమైన మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే మంచి అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులకు ఆటోమేటిక్ వీసా పొడిగింపు ఇవ్వాలని, ఓపీటీ సమయాన్ని ఈ నాలుగేళ్ల పరిమితి నుంచి మినహాయించి, గ్రేస్ పీరియడ్‌ను తిరిగి 60 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేసింది.












