CJP Demands: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రభుత్వం జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, వేలాది మంది యువత చేపట్టిన సంసద్ చలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసనకారులను నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వివరిస్తూ సీజేపీ ప్రతినిధులు అశుతోశ్ రంకా, సౌరవ్ దాస్ జేపీ నడ్డాకు లేఖను అందజేశారు. సోనమ్ వాంగ్ చుక్ ను వెంటనే విడుదల చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
పార్టీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వంతో సంప్రదింపులు జరపడానికి కేంద్ర మంత్రి సమయం కోరారని CJP ప్రతినిధి అశుతోష్ రంకా తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ తక్షణ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ (NEET) అభ్యర్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం వంటివి తమ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయన్నారు.
"నేను, సౌరవ్ దాస్ నడ్డా గారి నివాసంలోనే ఉన్నాము. సోనమ్ వాంగ్‌చుక్ తక్షణ విడుదల, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ (NEET) అభ్యర్థులందరికీ రూ. 1 కోటి పరిహారం వంటి మా డిమాండ్ల విషయంలో పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి నడ్డా గారు కొంత సమయం కోరారు" అని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో రంకా పేర్కొన్నారు.
తమ డిమాండ్ల గురించి తగిన స్థాయిలో చర్చిస్తామని నడ్డా హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్టమైన హామీలు లభించలేదని CJP ప్రతినిధి సౌరవ్ తెలిపారు. "డిమాండ్ నెరవేరే వరకు" ఈ నిరసన కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు."నేను, అశుతోష్ రంకా మధ్యాహ్నం 12 గంటల నుండి నడ్డా నివాసంలోనే ఉన్నాము. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే లేదా ఆయన్ని తొలగించాలనే డిమాండ్‌తో సహా మా అభ్యర్థనలన్నింటినీ ఆయనకు తెలియజేశాము" అని దాస్ చెప్పారు.












