టాలెంట్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఇప్పటికే ఎందరో నిరూపించారు. అయితే స్పోర్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు చిత్రపరిశ్రమలో తక్కువనే చెప్పవచ్చు.. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది.
జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తెలుగు తేజంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.. కంగ్రాట్స్ సింధు నిన్ను చూసి దేశం గర్విస్తోందని శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ కు స్పందించిన ఈ క్రీడాకారిణి.. ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ రిప్లై ఇచ్చారు.
అలాగే మీ సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. నన్ను మరచిపోకండని నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు. ప్రస్తుతం సింధు రిప్లై నెట్టింట వైరల్ అవుతుండగా.. త్వరలోనే సినిమాల్లోకి రానుందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. సరదాగా చేసిన వ్యాఖ్య అయినప్పటికీ.. సింధు సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. మరి రాజమౌళి స్పందిస్తారా? నిజంగానే పీవీ సింధు సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందా? లేక సరదా కామెంట్‌గానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.
మరోవైపు స్పోర్ట్స్ నుంచి సినీ రంగంలోకి రావడం కొత్తేమీ కాదు. భారతీయ క్రీడాకారుల్లో చాలామంది ఇప్పటికే వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రొఫెషనల్ రెజ్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దారా సింగ్.. తర్వాత బాలీవుడ్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా నిలిచారు. ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ 'ఫగ్లీ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సింధు విషయంలో కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.












