మెగా కాంపౌండ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయమై, తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నారు. తర్వాత కమర్షియల్ మాస్ రూట్ వదిలేసి, ప్రయోగాల వైపే నా అడుగులు అని చాటిచెబుతూ.. కంచె మూవీతో విమర్శకుల ప్రశంసలు, ఫిదా తో లవ్లీ బ్లాక్‌బస్టర్ హిట్, తొలిప్రేమ తో క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రాలు చేశారు.
అలాగే 'F2'తో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించి తన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్స్ వేసుకున్నాడు వరుణ్ తేజ్.. కానీ, ప్రయోగాలు చేసిన ప్రతీసారి విజయం వరించదు కదా.. అందుకే అంతరిక్షం లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రంతో పాటు.. గద్దలకొండ గణేశ్, గని, గాండీవధారి అర్జున, రీసెంట్‌గా వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.
అయిన హిట్టు ఫ్లాప్పులతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలనే నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాడు వరుణ్. ఈ క్రమంలోనే వస్తున్న మరో కొత్త మూవీ 'కొరియన్ కనకరాజు.. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ మెగా హీరో.. ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా.. సంగీత దర్శకుడు ఎస్. తమన్ సారధ్యంలో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన రెండో సాంగ్ రాస గుమ్మడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ పాటను పూర్తి తెలంగాణ జానపద శైలిలో మాస్ బీట్‌తో కంపోజ్ చేశారు .
నల్గొండ గద్దర్ ఎనర్జిటిక్ వాయిస్, కాసర్ల శ్యామ్ అందించిన చురుకైన సాహిత్యం.. పాటకు అసలైన జాతర వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ పాటలో ట్రెడిషనల్ లుక్‌లో వరుణ్ తేజ్ స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, మాస్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. మరోవైపు స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించిన దక్ష నాగర్కర్ తన గ్లామర్, డ్యాన్స్‌తో పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఇక ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.












