AP Rains: వానల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు రైతులు, జనాలు. వర్షాలు కురవాలని పూజలు, యాగాలు కూడా చేస్తున్నారు. కాగా, ఎల్ నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు ముఖం చాటేశాయి. ఎక్కడా చినుకు జాడే లేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పిడుగుల వానల నేపథ్యంలో ప్రజలకు పలు జాగ్రత్తలు చెప్పారు అధికారులు. ముఖ్యంగా రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని సూచించారు. చెట్ల కింద ఆశ్రయం పొందడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే కరెంట్ పోల్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు.
మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమన్నారు.












