Ebola Outbreak: ఆఫ్రికా దేశం కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తోంది. అక్కడ ఎబోలా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 930 మందిని ఈ వైరస్ బలి తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రావడం లేదు. మే 15 నుంచి ఇప్పటివరకు 2వేల 344 కేసులు నమోదయ్యాయి. ఇందులో 930 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కాంగో హెల్త్ మినిస్ట్రీ వివరాలు తెలిపింది. కాగా, 24 గంటల వ్యవధిలోనే 37 మంది చనిపోవడం వైరస్ తీవత్రకు అద్దం పడుతుంది.
''శనివారం (జూలై 18, 2026) నాటికి నిర్ధారితమైన 2,344 కేసుల్లో 930 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 కొత్త మరణాలు వెలుగుచూశాయి. ఇది ఒకే రోజులో నమోదైన అత్యధిక మరణాల సంఖ్యలో ఒకటిగా ఉంది'' అని అధికారులు వెల్లడించారు.
మే 15న తూర్పు కాంగోలో ఎబోలా వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు నమోదైన వాటిలో ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాప్తికి కారణమైన బండిబుగ్యో వైరస్, ఎబోలా వ్యాధిని కలిగించే ఇతర వైరస్‌ల కంటే అరుదైనది. దీనికి ఆమోదిత టీకా కానీ చికిత్స కానీ ఏదీ లేదు.
మరోవైపు హెల్త్ వర్కర్స్ ను సైతం వైరస్ భయపెడుతోంది. వైరస్ సోకిన వారిలో కనీసం 36 మంది ఆరోగ్య కార్యకర్తలు మరణించారు. ప్రస్తుతం 724 మంది రోగులు ఐసోలేషన్, ఆసుపత్రులలో ఉన్నారు. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.












