Russia Attack: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై మరోసారి భీకర దాడి చేసింది రష్యా. అయితే, ఈ దాడిలో నలుగురు భారతీయులు చనిపోయారు. ఉక్రెయిన్ లోని పోర్టు సిటీ ఒడెసాపై రష్యా విరుచుకుపడింది. గోల్డెన్ లియో కార్గో షిప్ పై అటాక్ చేసింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 8 మంది సిబ్బందిని కాపాడారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ దాడులను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సరికాదంది.
"భారత్ ఇటువంటి దాడులను ఖండిస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం లేదా నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు అత్యంత అభ్యంతరకరం. వాటిని నివారించాలి" అని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.
ఆ నౌక పేరు 'గోల్డెన్ లియో'. గినియా-బిసావు జెండాతో నడుస్తుంది. అందులో భారత్, సిరియాకు చెందిన సిబ్బంది ఉన్నారు. ఆ నౌకపై ఆదివారం రష్యా మూడు క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ నౌకాదళం తెలిపింది.
కాగా, ఉక్రెయిన్ లోని ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు చేస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఈ పోర్టుపై రష్యా పలు మార్లు అటాక్స్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 28 మంది చనిపోయారు. ''జూలై ప్రారంభం నుండి ఒడెసా ప్రాంతంపై నిరంతరం ప్రతిరోజూ షెల్లింగ్ జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో 13 నుండి 15 సార్లు వైమానిక దాడుల హెచ్చరికలు జారీ చేసిన రోజులు కూడా ఉన్నాయి" అని ఉక్రెయిన్ నౌకాదళం వెల్లడించింది.
ఒడెసా ఓడరేవులోని ఇంధన నిల్వలపై తమ బలగాలు దాడి చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణుల నుండి రక్షించుకోవడానికి కీలకమైన పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల కొరత ప్రస్తుతం కీవ్‌లో ఉండటంతో, రష్యా ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. తరచుగా బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగిస్తోంది.
ఉక్రెయిన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. రష్యా భూభాగంపై దాడులను ముమ్మరం చేస్తోంది. రాత్రికి రాత్రే వందలాది డ్రోన్‌లతో మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది.












