Leopard Attack: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుత పులి సడెన్ గా జనంలోకి వచ్చేసింది. అంతేకాదు ఏకంగా లిక్కర్ షాప్ లోకి దూరింది. ఆపై అక్కడి సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది. పులి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ రాష్ట్రం టోంక్ జిల్లా తోడారైసింగ్ టౌన్ లో జరిగింది.
అర్యణంలో ఉండాల్సిన పులి జనాల మధ్యకు వచ్చేసింది. తోడారైసింగ్ టౌన్ లోని పొదల్లో పులి కదలికలను స్థానికులు గుర్తించారు. దీంతో వారు భయపడిపోయారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. పులిని బంధించేందుకు సిబ్బంది వచ్చారు. అయితే, పులి వారిపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయిన పులి.. 400 మీటర్ల దూరంలోని లిక్కర్ షాప్ లోకి చొరబడింది. లిక్కర్ షాప్ సిబ్బందిపై దాడి చేసింది.
తొలుత వైన్ షాప్ బయట కూర్చుని ఉన్న ఫతే లాల్ కోలీ(40)పై దాడి చేసింది. అతడు భయంతో గట్టి గట్టిగా కేకలు పెట్టడంతో పులి షాప్ లోపలికి వెళ్లింది. అక్కడే ఉన్న సేల్స్ మ్యాన్ సంజయ్ గుర్జర్ (25)పై అటాక్ చేసింది. ఆపదలోనూ సంజయ్ ధైర్యంగా వ్యవహరించాడు. పులి బారి నుంచి తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి పులిని షాప్ లోపలే బంధించాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది జైపూర్ నుంచి వచ్చి.. షాప్ లోపల ఉన్న పులిని బోనులో బంధించి అక్కడి నుంచి తరలించింది. కాగా, పులి దాడిలో గాయపడ్డ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు ఇలా జనం మధ్యలోకి వస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్క వాటిని వెతుక్కుంటూ అవి జనాల్లోకి వచ్చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












